వెండితెరపై ఎన్నో అద్భుతాలు చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఏ పాత్ర అయినా ఆయన చేస్తే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు, సాంఘిక, జానపద, చారిత్రకమైన సినిమాలైనా సరే ఆయన నటిస్తే, ఆ పాత్ర పరిపూర్ణం అవుతుంది. తెలుగు సినీ చరిత్రలో  సాటిలేని కథానాయకుడిగా, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు ఎన్టీఆర్. నేడు ఆయన జయంతి . ఆయన నటుడుగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా,స్టూడియో అధినేతగా, రాజకీయవేత్తగా.. ముఖ్యమంత్రిగా ఇలా ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సృష్టించిన వ్యక్తి కేవలం నందమూరి తారక రామారావు అని చెప్పవచ్చు. అందుకే ఆయనని ప్రేక్షకులు విశ్వ విఖ్యాత,నటసార్వభౌమ, నటరత్న, మహానటుడు అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.
నాటకాలతో అప్పటికే మంచి నటుడిగా గుర్తింపు పొందారు రామారావు . అతడిని నటుడిగా గుర్తించిన వ్యక్తి ప్రముఖ దర్శకుడు నిర్మాత "బి.ఏ.సుబ్బారావు". ఆయన "పల్లెటూరి పిల్ల" చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా ఆలస్యం కావడంతో ఎల్.వి.ప్రసాద్ డైరెక్షన్ లో "మనదేశం" సినిమాలో అవకాశం రావడంతో,దానిలో నటించారు ఎన్టీఆర్. అప్పట్లోనే ఏడాదికి సగటున 10 చిత్రాలు ఆయనవే విడుదలయ్యేవి.


విజయ సంస్థతో కుదిరిన ఒప్పందంతో ఎన్టీఆర్ బ్యానర్ కు ఆస్థాన నటుడయ్యాడు. 1951లో కె వి రెడ్డి డైరెక్షన్లో విజయ వారు నిర్మించిన "పాతాళ భైరవి" సినిమా నటుడుగా ఎన్టీఆర్ కు తిరుగులేని స్టార్డం ను తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. అంతేకాకుండా 1956 లో విడుదలైన మాయాబజార్ లో తొలిసారి కృష్ణుడుగా నటించి మెప్పించాడు. ఎంతలా అంటే వెండితెరపై కృష్ణుడంటే రామారావు అనేంతగా చెరగని ముద్రవేసుకున్నారు . ఎన్టీఆర్సినిమా తర్వాత ఏకంగా 18 చిత్రాలలో కృష్ణుడి పాత్ర వేశారు.


రామారావు తొలిసారిగా రాముని గెటప్లో "చరణదాసి" అనే సాంఘిక చిత్రంలో కనిపించారు . ఆ తరువాత 1963లో విడుదలైన లవకుశ సినిమాలో రాముడి గా నటించిన ఎన్టీఆర్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించిపెట్టింది.

1959 లో  ఏ.వీ.యమ్ వారు నిర్మించిన భూకైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు జీవం పెట్టి పోషించారని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత తన సొంత బ్యానర్ పై నిర్మించిన "సీతారామకళ్యాణం" చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. అందులో రావణుడు గా కనిపించి మెప్పించాడు.
1977లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం "అడవి రాముడు". ఈ సినిమా ఎన్టీఆర్ కు ఎనలేని క్రేజ్ ను తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు. అదే ఏడాది విడుదలైన "దానవీరశూరకర్ణ" సినిమాలో ఎవరూ మర్చిపోలేరు. అందులో పోషించిన శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలు  వర్ణనాతీతం అనే చెప్పాలి.


"నా దేశం" చిత్రం ఎన్టీఆర్ నటించిన ఆఖరి మాస్ చిత్రం గా నిలిచిపోయింది. ఇక ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి,  9నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతుండగానే కొన్ని సినిమాలు చేసి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.ఎన్టీఆర్ తన 44 ఏళ్ల సినీ జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: