తెలుగు ఇండస్ట్రీలోని  స్టార్ హీరోలంతా పాన్ ఇండియన్ మూవీస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలీవుడ్ లోనూ తమ పేరు మారుమోగాలని భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ భారీ సినిమాల్లో గ్రామర్ ఫ్లేవర్ అద్దుతున్నారు. బాలీవుడ్‌ నుంచి స్టార్ హీరోయిన్స్‌ కి ప్రియారిటీ ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ 'ట్రిపుల్ ఆర్' తర్వాత పాన్ ఇండియన్ సినిమాలను క్యూలో పెట్టాడు.  కొరటాల శివతో కలిసి చేస్తున్న సినిమాలో ఆలియా భట్‌ని హీరోయిన్‌గా తీసుకుంటున్నారట. ఎందుకంటే ఆలియాకు భారతదేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఇదే ఈ సినిమాకు కలిసొస్తుందని మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు.

ఇక హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ సినిమా ప్రకటనతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే టాలీవుడ్  మార్కెట్‌తో పాటు బాలీవుడ్ లోనూ ఆసక్తి పెంచేందుకు రణ్‌వీర్‌ సింగ్‌ తో పాటు.. హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకున్నారు. 'కభీర్‌సింగ్' హిట్‌తో కియారాకి నార్త్‌లో మంచి గుర్తింపు వచ్చింది. విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బైలింగ్వల్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాక్సింగ్‌ చాంపియన్‌లా నటిస్తున్నాడు విజయ్. ఇక ఈ మూవీ అనుకున్నప్పుడే పూరీ ముంబయి వెళ్లిపోయాడు. అనన్యాపాండేని హీరోయిన్‌గా తీసుకున్నాడు.

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో 'హరి హర వీరమల్లు' అనే పీరియాడికల్ డ్రామా రూపొందుతోంది. ఔరంగజేబు కాలంనాటి కథాంశంగా రూపొందుతోన్న ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవల్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. అందుకే విలన్‌గా అర్జున్ రాంపాల్‌ని తీసుకున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో సెకండ్ హీరోయిన్‌ రోల్ చేయిస్తున్నారు.

ప్రభాస్, నాగ్ అశ్విన్‌ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్‌మెంట్ రాగానే అంతా ఆశ్చర్యపోయారు. యూనిక్‌ సబ్జెక్ట్స్‌ తీసే నాగీ, ప్రభాస్‌తో ఎలాంటి సినిమా తీస్తాడో అని ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ఈ హైప్స్‌ని పెంచడానికి హీరోయిన్‌గా దీపిక పదుకొణేని తీసుకొచ్చారు. అమితాబ్‌ బచ్చన్‌ని కీ-రోల్‌కి ఒప్పించారు. మనోళ్ల ప్రయోగాలు ఎంత వరకు సక్సెస్ ని ఇస్తాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: