
తన కట్టే కాలే వరకు టీడీపీ లో కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ కష్టంలో ఉంటే తాను ఒక సామాన్య కార్యకర్తగా సేవలు అందిస్తానని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే పార్టీ సంక్షోభాలు, సమస్యల్లో ఉన్నప్పుడు స్పందించారు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు సైతం స్పందించారు. మేనత్త భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సైతం తారక్ ప్రత్యేక ప్రకటన చేశారు.తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అవి ఆశించిన స్థాయిలో రుచించకపోయినా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాననే సంకేతాలు ఇచ్చారు. కానీ చంద్రబాబు అరెస్టు విషయంలో ఇంతవరకు స్పందించకపోవడం కాస్త విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అయి 15 రోజులు కావస్తున్నా తారక్ కానీ ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కానీ స్పందించలేదు. దేశ విదేశాల నుంచి చంద్రబాబుకు స్పందనలు వెల్లువెత్తుతున్నా తోటి కుటుంబ సభ్యులు మద్దతు తెలిపినా తారక్ మాత్రం స్పందించడం లేదు.
కాగా ఏడాది కిందట అమిత్ షా ను జూనియర్ ఎన్టీఆర్ కలిసారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉత్తమ నటన గాను తారక్ ను అభినందించేందుకు అమిత్ షా పిలిపించుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే తాజాగా నాటి కలయికపై మరోలా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును అరెస్టు చేస్తారని అమిత్ షా తారక్ కు చెప్పారని ఆ సమయంలో చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ సంఘీభావం తెలపొద్దని తారక్ వద్ద అమిత్ షా మాట తీసుకున్నారని టాక్ నడుస్తోంది. అందుకే చంద్రబాబు అరెస్టు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.