తెలంగాణలో టిక్కెట్ రేట్లు పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతులపై నెలకొన్న ఆందోళనకు 'హరిహర వీరమల్లుస మూవీతో ముగింపు పలికినట్లైంది. ఎప్పటి నుంచో నిర్మాతలు ఎదురుచూస్తున్న సమర్థవంతమైన పాలసీ ఎట్టకేలకు అమలులోకి వచ్చినట్లుగానే కనిపిస్తోంది. నెలరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులతో సినీ వర్గాల్లో ఆనందం నెలకొంది. ఈ వేడుక విజయవంతం కావడంలో తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ ‘దిల్’ రాజు కీలక పాత్ర పోషించారు. కానీ అదే సమయంలో, టిక్కెట్ రేట్లు పెంచుకోవడం, ప్రీమియర్ షోలు వేసుకోవడం వంటి అంశాల్లో మాత్రం ఆయనకు ప్రభుత్వానికి మధ్య ఓ అంతర్గత సంఘర్షణ ఉండేది.


ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద సినిమాలపై పరోక్షంగా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 'పుష్ప-2' విడుదల సమయంలో చోటు చేసుకున్న ఘటనల తర్వాత వారు స్పష్టంగా – టిక్కెట్ రేట్లు పెంచే ప్రాక్టీస్ ఇక కొనసాగదని, ప్రీమియర్ షోలకు ఎలాంటి స్పేస్ లేదని హెచ్చరించారు. దీంతో నిర్మాతల్లో గుబులు మొదలైంది. అయితే 'హరిహర వీరమల్లుస సినిమానికి అనూహ్యంగా మలుపు వచ్చింది. ఎ.ఎం.రత్నం కోరిక మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత రోహిన్ రెడ్డి రంగప్రవేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలసి తన వాదనను సమర్థవంతంగా వివరించారు. ఫలితంగా టిక్కెట్ రేట్లు పెంచుకోవడమే కాకుండా, ప్రీమియర్ షోలకూ అనుమతి లభించింది.



ఈ విషయాన్ని ఎ.ఎం.రత్నం స్వయంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించటం ఆసక్తికరంగా మారింది. “రోహిన్ రెడ్డి లేకపోతే ఇది సాధ్యపడేది కాదని” ఆయన చెప్పడం ద్వారా రోహిన్ పాత్రకు గౌరవం కలిగింది. రోహిన్ రెడ్డికి సినిమా రంగంతో పాత అనుబంధాలున్నాయి. సాయిధరమ్ తేజ్‌తో 'తిక్క' మూవీని నిర్మించడం, వారి సోదరుడు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించడం అనే అంశాలూ ఆయనకు భాగా క‌లిసి వ‌చ్చాయి ..  గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయినా, సినీ రంగంలో ప్రభావం చూపడంలో మాత్రం వెనకబడలేదు. ఈ పరిణామాల వల్ల రాబోయే పెద్ద సినిమాలకి దారి సుగమం అయింది. నిర్మాతలు ప్రభుత్వంతో అధికారికంగా మాట్లాడేందుకు ఓ మార్గం ఏర్పడింది. ఇకపై తెలంగాణలో టిక్కెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోల విషయంలో కొత్త అధ్యాయం మొదలైనట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: