అయితే ఈ భారీ విజయం చిరంజీవికి ఒక రకమైన సవాలును కూడా విసిరింది. ఆయన తదుపరి సినిమాగా రాబోతున్న 'విశ్వంభర' మీద ఇప్పుడు భారీ ఒత్తిడి నెలకొంది. యూవి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం అప్‌డేట్స్ విషయంలో కాస్త వెనుకబడి ఉంది. గతంలో విడుదల చేసిన శ్రీరామనవమి పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. తొలి టీజర్ కు ప్రతికూల స్పందన రాగా రెండో గ్లింప్స్ కూడా సాధారణంగానే ఉంది. దాదాపు ఏడాది కాలంగా విజువల్ ఎఫెక్ట్స్ పనుల కోసమే దర్శకుడు వశిష్ఠ సమయం కేటాయిస్తున్నారు. అయినప్పటికీ గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం పట్ల అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో సందిగ్ధత నెలకొంది.
ప్రస్తుతం 'మన శంకర వరప్రసాద్ గారు' అందించిన జోష్ ను విశ్వంభర చిత్రం కొనసాగించాల్సి ఉంది. బడ్జెట్ పరంగా అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా కంటెంట్ పరంగా ఎక్స్‌ట్రార్డినరీగా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే బిజినెస్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ పట్ల నమ్మకం కలుగుతుంది. గేమ్ ఛేంజర్ కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ మూవీ ఏడాది గడిచినా ఇంకా ప్రచార సినిమాలతో మెప్పించలేకపోవడం మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. గ్రాఫిక్స్ నాణ్యత విషయంలో రాజీ పడకుండానే వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత దర్శకుడిపై ఉంది. విడుదల తేదీ విషయంలో కూడా స్పష్టత లేకపోవడం ఈ సినిమా హైప్ కు ప్రతిబంధకంగా మారింది.
చిరంజీవి స్వయంగా ఈ చిత్రం పనులను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ వరకు ప్రధాన విడుదల తేదీలు అన్నీ బుక్ అయిపోవడంతో విశ్వంభరను ఈ వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని సలహాలు వినిపిస్తున్నాయి. 'మన శంకర వరప్రసాద్ గారు' ఇచ్చిన భారీ విజయంతో పెరిగిన అంచనాలను అందుకోవాలంటే విశ్వంభర టీమ్ మరింత కష్టపడాలి. అద్భుతమైన విజువల్స్ తో పాటు బలమైన కథాంశం తోడైతేనే మెగాస్టార్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరే అవకాశం ఉంటుంది. మరి ఈ ఫాంటసీ డ్రామాతో చిరంజీవి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి