సంక్రాంతి పండుగ కానుకగా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా లేదు. ఏకంగా ఐదు తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కావడంతో సినీ ప్రియులకు అసలైన వినోదం లభించింది. ప్రభాస్ ‘ది రాజాసాబ్’, చిరంజీవి చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’, అలాగే ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విశేషమేమిటంటే, ఈ ఐదు సినిమాలు కూడా దాదాపుగా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పండుగ సెలవులు కావడంతో ఇన్నాళ్లూ థియేటర్లన్నీ కళకళలాడాయి, వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రాలు మంచి ఊపును ప్రదర్శించాయి.
అయితే సంక్రాంతి సెలవులు ముగియడంతో బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సాధారణంగా సెలవుల తర్వాత సినిమాల వసూళ్లు తగ్గడం సహజమే అయినా, ఈసారి బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’లో పరిశీలిస్తే, ఏ సినిమాకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కనిపించడం లేదు. పండుగ హడావుడి తగ్గిన నేపథ్యంలో ఈరోజు నుంచి అన్ని సినిమాల బుకింగ్స్ ఊహించని స్థాయిలో పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ప్రభావం ఆయా సినిమాల ఓవరాల్ కలెక్షన్లపై ఎంతమేర పడుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, వర్కింగ్ డేస్‌లో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఈ ఐదు సినిమాలకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఈ వారమంతా నిలకడగా వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. తమ అభిమాన హీరోల సినిమాలు కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించాలని ఫ్యాన్స్ ఆశపడుతుండగా, ప్రస్తుత డ్రాప్స్ చూస్తుంటే లాంగ్ రన్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి