
నిర్మాతలు పెట్టిన నాలుగు ప్రధాన కండిషన్లలో రెండింటికి సినీ కార్మిక సంఘాలు అంగీకారం తెలిపాయి. అయితే మిగిలిన రెండు కీలక అంశాల విషయంలో యూనియన్లు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. వాటిలో ముఖ్యమైనది ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే కాల్షీట్ ఉండాలని నిర్మాతలు పట్టుబడుతున్నారు. సాధారణంగా షూటింగ్ లొకేషన్లలో కాల్షీట్ ఎక్కువగా ఉంటేనే కార్మికులకు అదనపు ఆదాయం వస్తుంది. కానీ 12 గంటలకే పరిమితం చేస్తే, వారికీ వచ్చే ఓవర్ టైం, అదనపు రెమ్యూనరేషన్ అంతా పోతుందనే భయం వారిలో ఉంది. అందుకే ఈ కండిషన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
ఇక రెండో పెద్ద విభేదం ఆదివారం పేమెంట్స్ విషయంలో ఉంది. ఇప్పటివరకు కార్మికులు ప్రతి ఆదివారం పనిచేస్తే డబుల్ పేమెంట్ పొందేవారు. అయితే ఇప్పుడు నిర్మాతలు నెలలో రెండో ఆదివారం, అలాగే ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే డబుల్ పేమెంట్స్ ఇస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల తమ వేతనాల్లో భారీ నష్టం కలుగుతుందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఈ రెండు అంశాలపై ఏకీభావం రాకపోవడంతో చర్చలు ప్రతిసారీ విఫలమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, చిన్న మరియు మధ్య తరహా నిర్మాతలు మరో సమస్యను లేవనెత్తుతున్నారు. యూనియన్ల మెంబర్స్ మాత్రమే తప్పనిసరి అనే నిబంధన వల్ల చిన్న సినిమాలు తిప్పలు పడుతున్నాయని, తాము నాన్ యూనియన్ కార్మికులను కూడా పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అలాంటి అవకాశం వస్తేనే చిన్న సినిమాలు బతుకుతాయని, ఇండస్ట్రీకి సరికొత్త ఊపిరి వస్తుందని వారు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఇరు పక్షాలూ తమ తమ డిమాండ్లపై కఠిన వైఖరిని కొనసాగిస్తున్నాయి. ఫలితంగా షూటింగ్స్ కు ఆటంకం కలుగుతోంది. సకాలంలో సినిమాలు రిలీజ్ కాకపోవడం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు మాత్రమే కాదు, చివరికి ప్రేక్షకులకూ ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఈ సమస్యను త్వరగా పరిష్కరించి సినీ పరిశ్రమలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాలని అందరూ కోరుకుంటున్నారు.