
రజినీ తన వీడియోలో మొదటినుంచే బాలయ్య స్టైల్ లోనే ప్రవేశించారు. “ఫ్లూటు జింక ముందు ఊదు .. సింహం ముందు కాదు. కత్తితో కాదురా.. కంటి చూపుతోనే చంపేస్తా” అంటూ బాలయ్య మాస్ డైలాగులు చెబుతూ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. రజినీ మాటల్లో – “ఇలాంటి పంచ్ డైలాగులు బాలయ్యగారే చెప్పాలి, వేరెవ్వరూ కాదు” అని చెప్పడం హాలులో హర్షధ్వానాలు రేపింది. అలాగే బాలయ్య వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ రజినీ – “బాలయ్య అంటేనే పాజిటివిటీ. నెగెటివిటీ ఆయన దగ్గర మచ్చుకు కూడా ఉండదు. ఆయన ఎక్కడ ఉన్నా అక్కడ ఆనందం, నవ్వు, ఉత్సాహం నిండిపోతాయి. ఆయనకి పోటీ ఆయనే.. వేరెవ్వరు కాదు” అని ప్రశంసించారు. బాలయ్య సినిమా హిట్ అవుతుంటే ఆయన అభిమానులే కాదు, వేరే హీరోల అభిమానులూ సపోర్ట్ చేస్తారని చెప్పారు.
“ఇప్పటికే 50 ఏళ్లు పూర్తి చేశారు. ఇక ముందు కూడా ఇలాగే నటిస్తూ, పాజిటివిటీని పంచుతూ, 75 ఏళ్ల సినీ ప్రస్థానం కూడా జరుపుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ బాలయ్య” అని రజినీ చెప్పడం బాలయ్య అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఇక అమితాబ్ బచ్చన్ లేఖలో కూడా బాలయ్యని విశేషంగా పొగడటం మరింత హైలైట్ అయింది. ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం పాటు తనదైన మాస్ స్టైల్ తో వెలుగొందిన బాలయ్యకు ఇంతటి గౌరవం దక్కడం అభిమానులకు గర్వకారణంగా మారింది. బాలయ్య డైలాగులు రజినీ నోట వినిపించడం ఒక చారిత్రాత్మక క్షణం. ఇది ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి మైలురాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.