
పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి సినిమా మీద ఉన్న అంచనాలు మాములుగా లేవు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. నిజానికి, ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఉన్నాయి. అంచనాలను పెంచేలా సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఉంది. సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి పవన్ ఫాన్స్‌తో పాటు టాలీవుడ్ సినీ అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మీద క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ హీరోలు సైతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు తాజాగా, యంగ్ సెన్సేషన్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నామనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "#OG హైప్‌కి హెల్త్ అప్సెట్ అయ్యేలా ఉంది. 25 వరకు మేము ఉంటామో, పోతామో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే, 25 తర్వాత ఏంటో పరిస్థితి? పవన్ కళ్యాణ్ కాదు, ఇది తుఫాన్. సుజీత్, దిస్ ఈజ్ అన్‌రియల్ మ్యాన్," అంటూ ఆయన తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం హీరోలే ఆగలేకపోతుంటే, కామన్ ఆడియన్స్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఓజి సినిమాకి పబ్లిక్‌లో ఇప్పుడు ఒక రేంజ్ క్రేజ్ కనిపిస్తోంది. సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మించారు.