
దక్షిణాదిన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో టికెట్ ధరలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. దీనికి తోడు క్రేజ్ ఉన్న సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు, అదనంగా రేట్లు పెంచేయడం అలవాటుగా మారింది. నిర్మాతలు డిమాండ్ చేస్తే, ఏపీలో సులభంగా రేట్ల పెంపుకు అనుమతులు వస్తున్నాయి. తెలంగాణలో కూడా కొన్ని సినిమాలకు మాత్రమే ప్రత్యేకంగా రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ రిలీజ్ సందర్భంగా కూడా ఇదే జరిగింది. ప్రీమియర్ షోలు రోజునే మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధరలకు టికెట్లు అమ్మడంతో భారీగా వసూళ్లు వచ్చాయి.
ఈ అధిక రేట్లు సినిమాలకు చివరికి నష్టమే చేస్తాయన్న చర్చలు కూడా ఉన్నాయి. టికెట్ రేట్లు అందుబాటులో లేకపోవడంతో సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే సంఖ్య తగ్గిపోతుంది. వీకెండ్‌లో అభిమానులు పెద్ద ఎత్తున హడావుడి చేసినా, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం వెనకడుగు వేస్తారు.
ఓజీ విషయంలో కూడా అదే జరిగింది. అధిక రేట్లు ఫుట్‌ఫాల్స్ తగ్గించాయని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, తూర్పు గోదావరి జిల్లాలో యూనిఫాం రేటు రూ.200గా నిర్ణయించడంతో అక్కడ ప్రేక్షకుల సంఖ్య పెరిగినట్లు సమాచారం. ఇది ఒక పాజిటివ్ సంకేతంగా కనిపిస్తోంది.
సాధారణంగా ఓజీకి పది రోజుల వరకు రేట్ల పెంపు అనుమతి ఉంది. కానీ, ఆదివారం వరకు ఈ పెరిగిన రేట్లు ఓకే అయినా, సోమవారం నుంచి సినిమా నిలబడాలంటే తప్పనిసరిగా రేట్లు తగ్గించాల్సిందే. అలా చేస్తే ఫుట్‌ఫాల్స్ పెరుగుతాయి. దసరా సెలవుల అడ్వాంటేజ్‌తో రెండో వీకెండ్ వరకు మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మిరాయ్ సినిమా రేట్లు తగ్గించి బాగానే లాభం పొందింది. అదే బాటలో ఓజీ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆలోచిస్తే, సినిమా లాంగ్ రన్‌కి దోహదం అవుతుందని ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి.