దేశ సరిహద్దులలో  జవానులు, దేశం లోపల పోలీసులు  ప్రజలను  రక్షించేందుకు  ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తుంటారని ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు.

వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, హీరో హీరోయిన్లుగా జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మిస్తున్నచిత్రం "కానిస్టేబుల్"" చిత్రం విడుదలకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ ఎమోషనల్ పాటను  హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ పాటను రామారావు రచించగా, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆలపించడం ఓ విశేషం.

ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి స్పందిస్తూ, "సమాజంలో పోలీసులు పోషిస్త్తున్న పాత్ర అనిర్వచనీయం. చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా పనిచేసే పోలీసులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు. అలాంటి  నిజాయితీ  కలిగిన ఓ కానిస్టేబుల్ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం. ఈ రోజు నేను ఆవిష్కరించిన ఎమోషనల్ పాట మనసును ఎంతగానో హత్తుకుంటోంది. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ ఈ పాటను ఆలపించి రక్తికట్టించారు. నా కళ్ళు  చమర్చాయి. వరుణ్ సందేశ్ కు ఇది  కమ్ బ్యాక్ చిత్రం కావాలి. కెప్టెన్ అఫ్ ది షిప్ దర్శకుడు. ట్రైలర్, ఈ పాట చూస్తుంటే దర్శక, నిర్మాతల అభిరుచి అర్ధమవుతోంది" అని అన్నారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "నేను ఇంతవరకు నటించిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో నా పాత్ర ఉంటుంది. చక్కటి డ్రామా, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరింపజేస్తుంది. యూనిట్ సమష్టి కృషికి ఈ చిత్రం ఓ మంచి ఉదాహరణగా నిలిచిపోతుంది. అలాగే నా కెరీర్ కు మరో మలుపు అవుతుంది" అని అన్నారు

చిత్ర నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ, "అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నైజాంలో ప్రముఖ సంస్థ ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతుంది. దాదాపు 500 థియేటర్ల పై చిలుకు థియేటర్స్ లో ప్రంపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. మేము ఏదైతే అనుకున్నామో, దానిని స్క్రీన్ పై తీసుకుని రావడంలో నూరుశాతం సక్సెస్ అయ్యాం. ఈ క్రెడిట్ మా టీమ్ అంతటికీ చెందుతుంది" అని అన్నారు.


దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ., "ట్రైలర్ కి వస్తున్న స్పందన చిత్రంపై మా నమ్మకాన్ని మరింత పెంచింది. ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్, ఒక లక్షకు పైగా లైక్స్ ఈ చిత్రం ట్రైలర్ కు వచ్చాయి. ఈ రోజు విడుదల చేసిన  ఎమోషనల్ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు లొకేషన్ లోని ప్రజలు నిజమైన సన్నివేశం అనుకుని కన్నీరు కార్చారు. సమాజానికి స్ఫూర్తిదాయకమైన ఇలాంటి చిత్రాలు రావాలని అందరూ కోరుకునేవిధంగా ఈ చిత్రం ఉంటుంది" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కెమెరామెన్ హజరత్, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, గీత రచయిత రామారావు, సహ నిర్మాత కుపేంద్ర పవార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిట్టపల్లి జగ్గయ్య, నటీ నటులు దువ్వాసి మోహన్, నిత్య, భవ్య, ఇందు తదితరులు పాల్గొన్నారు. ,

మరింత సమాచారం తెలుసుకోండి: