కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన “ కాంతార: చాప్టర్ 1 ” సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా మారింది. గతంలో వచ్చిన “కాంతార” సినిమా కల్చరల్ రూట్స్, ఆధ్యాత్మికత, భూత కోల సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఈ సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా తెర‌కెక్క‌డంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే కాంతార 1 బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం విడుదలైన తొలి షో నుంచే హవా క్రియేట్ చేసింది. రిషబ్ శెట్టి డైరెక్షన్, కథా నిర్మాణం, మరియు అద్భుతమైన నేపథ్య సంగీతం సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. ప్రస్తుతం సినిమా దేశవ్యాప్తంగా ప్రతి సెంటర్‌లో సూపర్ స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది.


రెండు వారాలు పూర్తయ్యే సరికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.717 కోట్ల వసూళ్లు సాధించినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ “కాంతార: చాప్టర్ 1” రికార్డ్ స్థాయి కలెక్షన్లు అందుకుంది. ఇప్పటివరకు రూ.105 కోట్లకు పైగా వసూలు చేస్తూ రిషబ్ శెట్టి సినిమాకు ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. కన్నడ రాష్ట్రంలో సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. బాలీవుడ్ మార్కెట్లో కూడా ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. మొత్తంగా చూస్తే, ఈ ప్రీక్వెల్ సినిమా ఇప్పుడు రూ.800 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతోంది.


ఇక ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా “చావా” ఉంది. విక్కీ కౌశల్‌, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆ హిస్టారికల్ డ్రామా దాదాపు రూ.800 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు “కాంతార: చాప్టర్ 1” ఆ రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉందా అనే చర్చ ఇండియ‌న్ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీపావళి సందర్భంగా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా “కాంతార” క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పలు సెంటర్లలో హౌస్‌ఫుల్ షోస్‌తో దూసుకుపోతోంది. తెగల మధ్య సంఘర్షణ, ఆధ్యాత్మికత, మరియు భూత కోల ఆచారాల నేపథ్యంతో కూడిన ఈ కథ ప్రేక్షకుల‌ను మెస్మ‌రైజ్ చేస్తోంది. మొత్తానికి, “కాంతార: చాప్టర్ 1” ఈ సంవత్సరం 2025 హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రిషబ్ శెట్టి దర్శకత్వ ప్రతిభతో పాటు, కథలోని స్థానికత, ఆత్మీయత, ఆధ్యాత్మికత ఈ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్లుగా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: