టాలీవుడ్‌లో కొన్ని హీరో–డైరెక్టర్ కాంబినేషన్‌లు ప్రత్యేకమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంటాయి. రాజమౌళి - ప్రభాస్, సుకుమార్ - అల్లు అర్జున్, రాజమౌళి - ఎన్టీఆర్ లాంటి కాంబినేషన్‌లు ఎప్పుడూ ఇండస్ట్రీలో మేజిక్ సృష్టించాయి. కానీ ఇలాంటి లెజెండరీ కాంబినేషన్‌లు మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలనుకున్నా, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆ అవకాశం కుదరలేదు. 2000 దశకంలో త్రివిక్రమ్ పేరు పరిశ్రమలో రచయితగా సూప‌ర్ రేంజ్‌లో ఉంది. వ‌రుస‌గా “నువ్వు నాకు నచ్చావ్”, “మన్మధుడు”, “మల్లీశ్వరి” సినిమాలకు ఆయన రాసిన డైలాగులు, పంచ్‌లు ఇప్పటికీ క్లాసిక్స్‌గా గుర్తిస్తారు. అదే సమయంలో త్రివిక్రమ్ దర్శకుడు విజయ్ భాస్కర్ టీమ్‌లో రచయితగా పని చేస్తున్నారు. 2002లో “నువ్వే నువ్వే” సినిమాతో త్రివిక్రమ్ దర్శకుడిగా అడుగుపెట్టి తర్వాత మహేష్ బాబుతో “అతడు”, “ఖలేజా”, పవన్ కళ్యాణ్‌తో “జల్సా”, “అత్తారింటికి దారేది” వంటి భారీ హిట్స్ అందించారు.


ఇదే సమయంలో విజయ్ భాస్కర్‌కీ ఒక పెద్ద అవకాశం వచ్చింది.. అదే బాలకృష్ణతో సినిమా చేయడం. బాలయ్య అప్పటికే యాక్షన్ సినిమాల జోష్‌లో ఉన్న కాలం అది. ఆయనతో సినిమా చేయాలనుకున్న దర్శకులు చాలా మంది ఉన్నారు. ఆ సమయంలో బాలయ్యకు విజయ్ భాస్కర్ మీద ప్రత్యేక నమ్మకం ఏర్పడింది. కారణం, ఆయన గతంలో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన “లారీ డ్రైవర్” సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం. ఆ సమయంలో బాలయ్య ఆయన పనితీరును చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యారట. ఆ టైంలో త‌న‌తో ఓ సినిమా చేయ‌మ‌ని బాల‌య్య విజ‌య్ భాస్క‌ర్‌ను అడిగార‌ట‌.


విజయ్ భాస్కర్ కూడా ఆ ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. త్రివిక్రమ్ ఆయన టీమ్‌లో రచయితగా ఉండటంతో, ఈ కాంబినేషన్‌లో బాలయ్యకు డైరెక్ట్‌గా స్క్రిప్ట్ రాయాలన్న ఆలోచన వచ్చింది. కానీ అదే సమయంలో విజయ్ భాస్కర్ “మల్లీశ్వరి” సినిమాతో బిజీగా ఉండడం వల్ల బాలయ్య సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత పరిస్థితులు మారి, ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు త్రివిక్రమ్ - బాలయ్య కాంబినేషన్ కుద‌ర‌లేదు. ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ ఈ కలయిక కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. త్రివిక్రమ్ మాటల మాంత్రికత్వం, బాలయ్య మాస్ డైలాగ్ డెలివరీ కలిస్తే థియేటర్లలో సునామీ సృష్టించేది అనే అభిప్రాయం సినీ ప్రేమికులది.

మరింత సమాచారం తెలుసుకోండి: