టాలీవుడ్‌లో ఇటీవ‌ల బాగా చర్చకు వస్తున్న విషయం ఏదైనా ఉంటే, అది నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాటు చేసిన దీపావళీ గ్రాండ్ పార్టీ గురించే. ఇంత భారీగా, ఇంత విలాసవంతంగా ఇండస్ట్రీలో పార్టీ ఇప్పటివరకు జరగలేదు. దాదాపు రెండు కోట్ల రూపాయల వ్యయంతో బండ్ల తన ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు సినీ తారలు, నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు ఇలా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీకి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరు రాగానే బండ్ల గణేష్ స్వయంగా కారు దగ్గరకు వెళ్లి ఆయనకు పాదాభివందనం చేస్తూ, లోపలికి ఆహ్వానించారు. చిరు పట్ల తన అభిమానాన్ని ఆయన మరొకసారి బహిర్గతం చేశారు. అంతేకాకుండా, బండ్ల ప్రత్యేకంగా తయారు చేయించిన సింహాసనం మీద చిరంజీవిని కూర్చోబెట్టి తెగ మురిసిపోయారు. ఆ సంతోషాన్ని ఆయన సోషల్ మీడియాలోనూ పంచుకున్నారు.


“మా బాస్ చిరంజీవి మా ఇంటికి వస్తారని తెలిసి ప్రత్యేక సింహాసనం తయారు చేశాను. ఆయన ఆ సింహాసనంపై కూర్చోవడం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది” అంటూ ఎక్స్‌లో బండ్ల రాసుకొచ్చారు. పార్టీకి హాజరైన వారిలో విక్టరీ వెంకటేష్, హీరో శ్రీకాంత్, నిర్మాత నవీన్ ఎర్నేని, యంగ్ హీరోలు తేజా సజ్జ, సిద్దు జొన్నలగడ్డ, ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి తనూజ్ వంటి అనేక మంది సెలబ్రిటీలు ఉన్నారు. ప్రతి ఒక్కరినీ బండ్ల స్వయంగా స్వాగతించి, అప్యాయంగా ఆతిథ్యం ఇచ్చారు. వేడుకలో భోజనం, సంగీతం, డెకరేషన్ అన్నీ రాజభోగంగా నిర్వహించబడ్డాయి.


ఇక ఈ పార్టీకే ఖర్చయిన మొత్తం గురించి ఇండస్ట్రీ అంతా షాక్ అవుతోంది. లీకైన సమాచారం ప్రకారం, బండ్ల దీపావళీ వేడుకకు సుమారు రూ. 2 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అందులో కేవలం భోజనాలకే కోటి రూపాయలకుపైగా వెచ్చించారట. ఒక్కో ప్లేట్ ధర దాదాపు రూ. 15,000 అని చెప్పుకొస్తున్నారు. మిగతా డెకరేషన్, లైటింగ్, మ్యూజిక్, సెక్యూరిటీ, గిఫ్ట్స్ అన్నీ కలిపి మరో కోటి రూపాయల వ్యయం అయిందని టాక్. ఇప్పటివరకు టాలీవుడ్‌లో జరిగిన పార్టీలలో ఇది అత్యంత ఖరీదైన వేడుకగా గుర్తింపు పొందింది. అయితే, బండ్ల గణేష్ ఈ సడెన్‌గా లగ్జరీ పార్టీ ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది ఆయన సినీ రీఎంట్రీకి ప్రణాళికలో భాగమా? లేక వ్యక్తిగత ఆనంద వేడుకేనా? అనే విషయంపై క్లారిటీ రానున్న రోజుల్లో తెలుస్తుందనే ఆసక్తి పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: