టాలీవుడ్‌లో మాస్ రాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్ ఒకప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా ఉండేది. ఇద్దరి బంధం 90వ దశకంలోనే మొదలైంది. అప్పట్లో రవితేజ కృష్ణవంశీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో చిన్న పాత్రలో కూడా కనిపించాడు. ఆ తరువాత కృష్ణవంశీ రవితేజకు హీరోగా మొదటి అవకాశం ఇచ్చిన ‘సింధూరం’ సినిమా తెరపైకి వచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్ కాకపోయినా, టాలీవుడ్‌లో అది కల్ట్ క్లాసిక్‌గా మారింది. రవితేజ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.


తరువాత రవితేజ స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా, కృష్ణవంశీతో మళ్లీ కలసి ‘ఖడ్గం’ లాంటి మల్టీస్టారర్ సినిమాలో నటించాడు. ఆ సినిమాలో ఆయన పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అప్పటివరకు ఇద్దరి మధ్య స్నేహం బలంగా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏదో జరిగిందో ఏమో ఒక దశలో రవితేజ, కృష్ణవంశీ మధ్య మాటలు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికీ రవితేజ మాత్రం కృష్ణవంశీ గురించి గౌరవంగా మాట్లాడుతూనే ఉంటాడు. ఇటీవల తన కొత్త సినిమా ‘మాస్ జాతర’ ప్రమోషన్ల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, కృష్ణవంశీ తనను “ఏరా” అని పిలిచేవాడని, ఆయనతో ఉన్న అనుబంధం మర్చిపోలేనిదని చెప్పాడు. అయితే కృష్ణవంశీ మాత్రం రవితేజ పేరు వినగానే ఇంటర్వ్యూలలో తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో రవితేజ గురించి ప్రశ్న అడిగితే “నెక్ట్స్‌ క్వశ్చన్”, “దాని గురించి మాట్లాడను”, “తెలీదు” అని చాలాసార్లు చెప్పారు.


దీంతో ఇద్దరి మధ్య నిజంగా ఏమైంది? అనే ప్రశ్న అభిమానులను, సినీ వర్గాలను కుదిపేస్తోంది. కృష్ణవంశీ కెరీర్‌లో కాస్త డౌన్‌ఫేజ్‌లో ఉన్నప్పుడు రవితేజతో సినిమా చేయాలనుకున్నారా? కానీ రవితేజ తిరస్కరించాడా? లేక మాట ఇచ్చి వెనక్కి తగ్గాడా? లేదా మరేదైనా వ్యక్తిగత అపార్థం జరిగిందా ? అన్న సందేహాలు కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై చర్చలు ఊపందుకున్నాయి. ఒకవైపు రవితేజ వీడియోలు కృష్ణవంశీపై గౌరవాన్ని చూపుతుంటే, మరోవైపు కృష్ణవంశీ ఇంటర్వ్యూల్లో ఆయనను పూర్తిగా అవాయిడ్ చేయడం అభిమానులను కన్‌ఫ్యూజ్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: