తెలంగాణలోని గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుకోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది అగ్ని పరీక్షగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచార బరిలోకి దిగి పలు సభల్లో పాల్గొంటూ ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రతి పార్టీ తమదైన వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి బిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికల మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఆయన రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలపగా, దానికి “థాంక్స్” అంటూ చిన్నపాటి సమాధానం మాత్రమే రావడంతో జూనియర్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో స్నేహపూర్వకంగా చేసిన ట్వీట్‌కి ఈ విధంగా పొడి స్పందన రావడం సరైంది కాదని వారు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.


నిజానికి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. అయితే సీఎం అయిన తర్వాత రేవంత్ ట్విట్టర్ హ్యాండిల్‌ని పీఆర్ టీమ్ నిర్వహిస్తుండటంతో ఈ సమాధానం వారి ద్వారా వచ్చి ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయినా సరే, ఇటువంటి సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మరో ఆసక్తికర అంశం పవన్ కళ్యాణ్ పేరు చుట్టూ తిరుగుతోంది. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పవన్ కళ్యాణ్ మద్దతు తమకేనని బహిరంగ సభల్లో చెప్పడం చర్చనీయాంశమైంది. ఆయన పవన్‌ను “మనవాడే కదా, సినీ హీరో కదా, సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కదా” అంటూ బీజేపీకి జనసేన ఓట్లు వస్తాయని నమ్మకంగా వ్యాఖ్యానించారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి అధికారంలో ఉన్న నేపథ్యంలో, తెలంగాణలో కూడా ఈ రాజకీయ అనుబంధం ప్రభావం చూపుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జనసేన స్థానిక నేతలు బీజేపీకి మద్దతు ప్రకటించడంతో, ఆ మద్దతును బీజేపీ విస్తృతంగా ప్రచారంలో ఉపయోగిస్తోంది. ఒక వైపు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు పవన్ కళ్యాణ్ మద్దతు బీజేపీ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: