రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ‘గ్లోబ్ ట్రాటర్’ గ్రాండ్ ఈవెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎన్నో ఏళ్లుగా మహేష్ బాబు–రాజమౌళి కాంబినేషన్ సినిమా కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది అభిమానులు ఈ ఈవెంట్‌ను ఉత్కంఠగా వీక్షించారు. చివరికి అందరి ఊహాగానాలు నిజమవుతూ, మహత్తర ప్రాజెక్ట్‌కు ‘వారణాసి’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ప్రకటించేశారు. అభిమానులు ఆశించినట్టుగానే వచ్చిన ఈ టైటిల్, సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయిపోయింది. అయితే టైటిల్ రివీల్‌తో పాటు విడుదల చేయాల్సిన స్పెషల్ గ్లింప్స్ కోసం రాజమౌళి మరియు ఆయన టీమ్ గత నెల రోజులుగా అహర్నిశలు శ్రమించిన విషయం స్టేజ్ మీద ఆయనే వెల్లడించారు. షూటింగ్,  సౌండ్, గ్రాఫిక్స్—ప్రతి దాంట్లోనూ రాజమౌళి ప్రమాణాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందుకే ఈ స్పెషల్ గ్లింప్స్‌ను అభిమానుల ముందుంచాలని టీమ్ రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసిందట.


కానీ చివరి క్షణాల్లో వచ్చిన టెక్నికల్ సమస్యలు భారీ అడ్డంకిగా మారాయి. “గ్లింప్స్‌ను సమయానికి విడుదల చేయాలనే మా కోరిక నెరవేరలేదు. టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వీడియో ఔట్‌పుట్ మా ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టుగా రాలేదు” అని రాజమౌళి స్టేజ్ మీద చెప్పారు. ఈ సమస్యను వెంటనే సరిచేయడానికి మళ్లీ ప్రయత్నించినా… మరోసారి టెక్నికల్ గ్లిచ్ రావడంతో, అనుకున్న ప్రమాణాలను అందుకోలేకపోయామని, అయినా అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో ఏదో విధంగా చేసి గ్లింప్స్‌ను విడుదల చేశామని తెలిపారు. అయితే ఆ వీడియో మాత్రం వారి కష్టాన్ని పూర్తిగా ప్రతిబింబించలేదని, అందుకే ఆయన మనసుకు బాగా బాధ వేసిందని చెప్పారు.



ఇందుకోసం మాట్లాడుతూ రాజమౌళి భావోద్వేగానికి లోనయ్యారు. “మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారు… ‘హనుమాన్ వెనక ఉండి నడిపిస్తాడు’ అని. కానీ ఈరోజు నాకు దేవుడిపై కోపం వస్తోంది. మా ఇంట్లో నా భార్య రమా కూడా పెద్ద హనుమంతుడి భక్తురాలు. ఇలాంటి రోజు ఇలా జరగడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది…” అని చెప్పుతూ రాజమౌళి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన భావోద్వేగం చూసి స్టేజ్ పక్కనే ఉన్న నమ్రత కూడా మనసు కదిలిపోయి ఎమోషనల్ అయిపోయింది. అక్కడున్న అభిమానులు, గెస్ట్‌లు, సినీ ప్రముఖులు—అందరు ఎమోషనల్ అయిపోయారు. అంతలోనే స్టేజ్‌పై రాజమౌళి కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చకచకా వైరల్ అయ్యాయి. కొన్ని నిమిషాల్లోనే #Rajamouli, #Varanasi, #MaheshBabuవంటి హ్యాష్‌టాగ్‌లు ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయాయి.



మొత్తం మీద ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఒక భారీ వేడుక కాగా, రాజమౌళి చూపించిన నిజమైన ప్యాషన్, ఆయన కళ్లలో వచ్చిన కన్నీళ్లు అభిమానులను మరింత ఎమోషనల్ చేశాయి. ఈ సినిమా ఎంత పెద్దది, ఎంత అంకితభావంతో రూపొందుతున్నదో ఈ సంఘటన మరొక్కసారి నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: