కేవలం వారం రోజుల వ్యవధిలో అగ్ర కథానాయకులైన నాగార్జున, చిరంజీవిల క్లాసిక్ సినిమాలు 'శివ', 'కొదమ సింహం' రీ రిలీజ్ కావడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో పెద్ద చర్చకే దారి తీసింది. నిజ జీవితంలో చిరంజీవి, నాగార్జున అత్యంత ఆప్తులు, మంచి స్నేహితులు అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఎదురుపడటం, ముఖ్యంగా రీ రిలీజ్ రూపంలో పోటీ పడటం అభిమానుల మధ్య తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది.
రీ రిలీజ్‌ల విషయంలో బాక్సాఫీస్ లెక్కలు చూస్తే, నాగార్జున 'శివ' స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ చిత్రం నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి, రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. శివ సినిమాకు ఉన్న సాంకేతిక, కథా బలం, అలాగే అప్పటి యువతను ఇప్పటికీ ఆకట్టుకునే దాని వైబ్రేషన్ ఈ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
మరోవైపు, చిరంజీవి 'కొదమ సింహం' రీ రిలీజ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. మెగాస్టార్ సినిమాకు ఉండాల్సిన వసూళ్లను ఈ చిత్రం అందుకోలేకపోయింది. అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, చిరంజీవి గత రీ రిలీజ్‌ల జోరు ఈ చిత్రానికి దక్కలేదు.
ఈ రెండు సినిమాల ఫలితాలు చిరంజీవి, నాగార్జున అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఒకవైపు నాగార్జున అభిమానులు 'శివ' విజయాన్ని తమ హీరో స్టామినాగా అభివర్ణిస్తుంటే, మరోవైపు చిరంజీవి అభిమానులు రీ రిలీజ్ విషయంలో వచ్చిన స్వల్ప తేడాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. నిజ జీవితంలో స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు హీరోల సినిమాల మధ్య రీ రిలీజ్ రూపంలో జరిగిన ఈ పోరు వల్ల వారి ఫ్యాన్స్ మధ్య మాత్రం "పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే" పరిస్థితి నెలకొంది. అంతిమంగా, ఈ రీ రిలీజ్ వార్ తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక మంచి వినోదాన్ని, పాత జ్ఞాపకాలను అందించింది అనడంలో సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి