టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో వంశీ పైడిపల్లి ఒకరు. ఆయన మేకింగ్ స్టైల్, ఎమోషన్స్‌ను పండించే విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కెరీర్ ప్రారంభంలో 'మున్నా' వంటి మాస్ చిత్రంతో పలకరించినప్పటికీ, 'బృందావనం' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువయ్యారు. ఆ తర్వాత వచ్చిన 'ఎవడు' కమర్షియల్ సక్సెస్‌ను అందించగా, 'ఊపిరి' సినిమా వంశీలోని క్లాసిక్ మేకింగ్ యాంగిల్‌ను బయటకు తీసి విమర్శకుల ప్రశంసలు దక్కేలా చేసింది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన 'మహర్షి' సినిమా సామాజిక సందేశంతో పాటు భారీ వసూళ్లను సాధించి, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే కాకుండా ఆయన రేంజ్ ను శిఖరాగ్రానికి చేర్చింది.

రీసెంట్‌గా దళపతి విజయ్‌తో తెరకెక్కించిన 'వారసుడు' చిత్రంతో కోలీవుడ్‌లోనూ తన సత్తా చాటారు. ఇతర దర్శకులతో పోలిస్తే వంశీ పైడిపల్లి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉండటం విశేషం. ప్రతి సినిమాను చాలా కాలం పాటు స్క్రిప్ట్ వర్క్ చేసి, పక్కా ప్లానింగ్‌తో తెరకెక్కించడం ఆయన విజయ రహస్యం. వంశీ పైడిపల్లి కేవలం ఒక కమర్షియల్ డైరెక్టర్ మాత్రమే కాదు, టెక్నికల్ వాల్యూస్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమాలను అత్యంత రిచ్‌గా ప్రెజెంట్ చేస్తారు. అందుకే అగ్ర హీరోలంతా ఆయనతో పనిచేయడానికి మొగ్గు చూపుతుంటారు.

ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో చేయబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫిబ్రవరి నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని, సల్మాన్ ఖాన్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో వంశీ చూపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను అలరించిన వంశీ, ఇప్పుడు నేరుగా బాలీవుడ్ అగ్ర హీరోతో సినిమా చేయడం ఆయన కెరీర్‌లో ఒక పెద్ద మలుపుగా భావించవచ్చు.

సౌత్ సినిమాల హవా దేశవ్యాప్తంగా నడుస్తున్న తరుణంలో, వంశీ పైడిపల్లి తన మార్క్ మేకింగ్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన జెండా పాతాలని అభిమానులు ఆశిస్తున్నారు. సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్‌కు వంశీ పైడిపల్లి క్లాస్ టచ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పాన్-ఇండియన్ లెవల్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అధికారిక వివరాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: