కథ :
కట్టుబాట్లు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సరస్వతీపురంలో ఊరి పెద్ద రాఘవయ్య (రాంకీ) కఠినమైన తీర్పులు ఇస్తూ ఉంటాడు. చదువులో చురుగ్గా ఉండే నీలకంఠ (మహేంద్రన్), పదవ తరగతిలో చేసిన ఒక తప్పు వల్ల గ్రామ పెద్దల నుండి కఠినమైన శిక్షను ఎదుర్కొంటాడు. 15 ఏళ్ల పాటు ఊరు దాటకూడదని, చదువు మానేయాలని అతనికి ఆంక్షలు విధిస్తారు. తన చిన్ననాటి ప్రేమ సీత (యష్న ముత్తులూరి) కోసం, అలాగే తన ఊరి గౌరవం కోసం కబడ్డీ ఆటను ఆయుధంగా చేసుకుని నీలకంఠ ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా సారాంశం. తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని నీలకంఠ కబడ్డీ ఆటలో ఎలా ఎదిగాడు? సర్పంచ్ (పృథ్వీ) కూతురును పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? గ్రామాన్ని కబడ్డీలో గెలిపించడం కోసం ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
ఈ సినిమా కోసం ఎంచుకున్న స్టోరీ లైన్ విభిన్నంగా ఉంది. ఊరిలోనే ఉంచి ఇష్టమైన దానికి దూరం చేయడం అనే విభిన్నమైన పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఫస్టాఫ్ లో లవ్ స్టోరీని, ఎమోషనల్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. సెకండాఫ్ లో రేసీ యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అరగంట పాటు సాగే క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు.
నటీనటుల పనితీరు పరంగా చూస్తే, మాస్టర్ మహేంద్రన్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. బాల నటుడిగా ఉన్న అనుభవం తన నటనలో ప్రతిబింబించింది. ఎమోషనల్ సీన్స్‌లోనూ, కబడ్డీ యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ మహేంద్రన్ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ యష్న ముత్తులూరి సహజమైన నటనతో మెప్పించగా, చాలా కాలం తర్వాత స్నేహ ఉల్లాల్ ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించడం ఈ సినిమాకు ప్లస్ అయింది. సీనియర్ నటుడు రాంకీ, బబ్లూ పృథ్వీరాజ్ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
దర్శకుడు రాకేష్ మాధవన్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. ఒక వ్యక్తికి ఇష్టమైన దానిని దూరం చేయడం ద్వారా శిక్షించడం అనే కాన్సెప్ట్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. శ్రవణ్ జి కుమార్ విజువల్స్ పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాయి. మార్క్ ప్రశాంత్ అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను ఎలివేట్ చేయడంలో విజయవంతమైంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. మర్లపల్లి శ్రీనివాసులు,దివి వేణుగోపాల్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
మొత్తానికి, 'నీలకంఠ' సినిమా కేవలం మామూలు కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, ఇందులో బలమైన కంటెంట్ మరియు భావోద్వేగాలు ఉన్నాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలను, స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్ అవుతుంది.
రేటింగ్ : 2.75/5.0
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి