టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఆదర్శ కుటుంబం' గురించే చర్చ. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వెంకీ మామ చేస్తున్న ఈ 77వ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఫ్యామిలీ డ్రామా అనుకుంటే పొరపాటే.. 'AK 47' అనే ట్యాగ్‌లైన్‌తోనే ఇందులో ఏదో గట్టి యాక్షన్ ఉందని హింట్ ఇచ్చారు గురూజీ. దానికి తగ్గట్టుగానే, ఇప్పుడు నారా రోహిత్‌ను రంగంలోకి దించి సినిమా వెయిట్‌ను డబుల్ చేశారు.


లేటెస్ట్ ఫిలిం నగర్ టాక్ ప్రకారం.. నారా రోహిత్ ఈ సినిమాలో ఒక యాంటీ-కాప్ (Anti-Cop) రోల్‌లో కనిపించబోతున్నారట.'అల వైకుంఠపురంలో' సినిమాలో సుశాంత్ పాత్ర లాగే ఇది కూడా కథను మలుపు తిప్పే కీలక పాత్ర అని తెలుస్తోంది. అయితే, రోహిత్ పాత్రలో కొంచెం నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని, వెంకటేష్‌తో ఆయనకు వచ్చే సీన్స్ థియేటర్లలో క్లాప్స్ కొట్టించేలా ఉంటాయని సమాచారం. ఇటీవల 'భైరవం', 'సుందరకాండ' వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన రోహిత్‌కు, ఈ త్రివిక్రమ్ సినిమా ఒక బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో 'పుష్ప'లో భన్వర్ సింగ్ పాత్రను మిస్ చేసుకున్న రోహిత్‌కు, ఈ పోలీస్ క్యారెక్టర్ ఆ వెలితిని తీరుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు నారా రోహిత్ మార్క్ గంభీరమైన వాయిస్ కలిస్తే ఆ కిక్కే వేరు."వెంకీ మామ సెటిల్డ్ యాక్టింగ్.. రోహిత్ బేస్ వాయిస్.. త్రివిక్రమ్ ప్రాస డైలాగులు.. బాక్సాఫీస్ దగ్గర అసలైన వేట మొదలైనట్టే!" అంటూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.



'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47' అనే టైటిల్‌లో 'కుటుంబం' అనే అక్షరం ఎరుపు రంగులో, రక్తం కారుతున్నట్టుగా ఉండటం గమనార్హం. కేవలం ఇంట్లో జరిగే గొడవలే కాకుండా, బయట సమాజంలో ఒక సామాన్య కుటుంబం ఎదుర్కొనే సీరియస్ సమస్యలను, అందులో వచ్చే యాక్షన్ పార్ట్‌ను త్రివిక్రమ్ చాలా ఇంటెన్స్‌గా చూపిస్తున్నారట. అందుకే ఇందులో నారా రోహిత్ లాంటి సీరియస్ యాక్టర్‌ను ఎంచుకున్నారని టాక్.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా జరుగుతోంది. నారా రోహిత్ ఇప్పటికే సెట్స్‌లో జాయిన్ అయినట్లు సమాచారం. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమాను 2026 వేసవి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.



మొత్తానికి త్రివిక్రమ్ తన మార్క్ ఫ్యామిలీ డ్రామాకు నారా రోహిత్ లాంటి 'మాస్' ఎలిమెంట్‌ను జోడించి ఒక అదిరిపోయే ప్యాకేజీని సిద్ధం చేశారు. 2026 సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో సందడి చేయనున్న వెంకీ మామ, సమ్మర్ లో ఈ 'ఆదర్శ కుటుంబం'తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: