ఎట్టకేలకు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇప్పటి వరకు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ, అధినేత జగన్ వ్యవహారశైలిని తప్పుపడుతూ, పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతూ వస్తున్నారు. అంతే కాకుండా, సొంత పార్టీ కార్యకర్తల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ, లోక్ సభ స్పీకర్ కు సైతం ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించారు. ఆయన వైసీపీ నుంచి గెలిచిన దగ్గర నుంచి, వైసిపి నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండకుండా, సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నారని వైసిపి ఆయన పై ఆగ్రహంగానే ఉంటూ వస్తోంది. అప్పట్లోనే సీఎం జగన్ ఆయనను పిలిపించుకుని, నచ్చచెప్పినా ఆయన వైఖరిలో మార్పు కనిపించలేదు.
ఇక కొద్ది రోజులుగా అదేపనిగా వైసిపి ని ఆయన టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉండడం, బిజెపి అగ్రనేతలతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించడం, ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్న వైసిపి అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వైసిపి ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నోటీసులు అందించారు. గత పది రోజులుగా పార్టీ అధినాయకత్వం మీద, వైసీపీ ఎమ్మెల్యేల మీద చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనికి సరైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఈ వ్యవహారం పై రఘురామకృష్ణరాజు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఇక ఆయన వైసీపీ నుంచి సస్పెండ్ అయితే బిజెపిలో చేరవచ్చని ఆలోచనతోనే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని, వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు వ్యతిరేకంగా ఆయన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఆయన తాను జగన్ ఫోటో పెట్టుకుని గెలవలేదని, తన ఫోటో పెట్టుకుని వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారని, వారంతా రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం అయితే, తాను కూడా రెడీ అంటూ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షోకాజ్ నోటీసులకు రఘురామకృష్ణంరాజు ఏం సమాధానం చెప్తారు అనేది వైసీపీలో ఇప్పుడు చర్చగా మారింది.
click and follow Indiaherald WhatsApp channel