తెలంగాణాకు చెందిన ఎన్నారై కుటుంబానికి అరుదైన అదృష్టం లభించింది. దుబాయ్ లో స్థిరపడిన బందం శ్రీనివాస్ రెడ్డి అనే ఎన్నారై తన భార్య డాక్టర్ పోటు హరిత రెడ్డి, కుమారుడు సంజీత్ రెడ్డితో కలిసిన ఏప్రిల్ 18న స్వదేశానికి తిరిగొచ్చారు. కాగా, కరోనా వల్ల ఏప్రిల్ 24న దుబాయ్ విమాన రాకపోకలను నిలిపివేసింది. హరిత రెడ్డి తండ్రి మరణించడంతో.. వారు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు స్వస్థలానికి వచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తరువాత తిరిగి దుబాయ్ వెళ్లాలనుకున్నారు. ఆరు సార్లు ఫ్లైట్ బుక్ చేశారు. కరోనా వల్ల రద్దు అయిన విమానాలు మళ్ళీ ప్రారంభం అవుతాయో లేదో అనే అనుమానంతో బుకింగ్ కాన్సిల్ చేశారు.



చివరికి డాక్టర్ హరిత దుబాయ్ హెల్త్ అథారిటీ నుంచి అనుమతి కోరారు. యూఏఈ హెల్త్ కేర్ నిపుణులను, వారి కుటుంబాల రాకను దేశం అనుమతిస్తోంది. దీంతో శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి దుబాయ్ వెళ్లడానికి అనుమతి లభించడంతో పాటు ఓ ఫ్లైట్ టికెట్ దొరికింది.



ఇటీవల హైదరాబాద్ నుంచి షార్జాకు ఎయిర్ అరేబియా విమానం బయలుదేరింది. ఈ విమానంలోనే తెలంగాణ ఎన్నారై కుటుంబం తమ ప్రయాణాన్ని కొనసాగించింది. విమానంలో వారు విమాన సిబ్బంది తప్ప మిగతా ఎవరు ఎక్కలేదు. దీనితో ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా ఎయిర్‌బస్ -320 విమానంలో ప్రయాణించే అరుదైన అదృష్టాన్ని దక్కించుకున్నట్లు అయింది. దీంతో ఎన్నారై కుటుంబ సభ్యులు ప్రైవేట్ జెట్ ప్రయాణ సౌకర్యాన్ని ఎంజాయ్ చేశారు.



సాధారణంగా ఇతర ప్యాసింజర్లు ఎవరూ లేకుండా మొత్తం విమానంలో ప్రయాణించాలంటే అదనంగా చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ కరోనా కాలంలో నిబంధన నిమిత్తం చాలామంది ఫ్లైట్ కాన్సిల్ చేసుకున్నారు. మిగతా ప్రయాణికులను దుబాయ్ ఫ్లైట్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఎన్నారై కుటుంబానికి డబ్బు కట్టకుండానే ప్రైవేటు జర్నీ చేసే అవకాశం దక్కింది. వీరు ఆగస్టు 4 వ తేదీన దుబాయ్ కి చేరుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి ప్రముఖ తెలంగాణ న్యూస్ మీడియాతో మాట్లాడుతూ తన స్వస్థలం కరీంనగర్ అని తెలిపారు. 30 ఏళ్ల కాలంలో తాను తొలిసారిగా మూడు నెలల పాటు కరీంనగర్ లో గడపాల్సి వచ్చిందని అన్నారు. అప్పటికీ ఇప్పటికీ కరీంనగర్ చాలా డెవలప్ అయిందని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: