ఓవైపు కర్నాటక ఫలితాలు కాంగ్రెస్ కు ఆనందం కలిగిస్తుంటే ఏపీలో జరుగుతున్న పరిణామాలు పార్టీని కలవర పెడుతున్నాయి. కొంత కాలంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎవరిని లెక్క చేయని విధానం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తుంది. తాను ఎవరి దయాదాక్షిన్యాల వల్ల సీఎం కాలేదనో, లేకపోతే తాను మొండి ఘటాన్ని అనో ఈ మధ్యన ఎక్కువగా ప్రకటన చేస్తున్నారు. అంతే కాదు నేను ఎవరినీ లెక్క  చేయనని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇటీవల కాలంలో ఆయన ఒంటెత్తు పోకడలపై మంత్రులు బాహాటంగానే విమర్శలు చేశారు. పథకాలు కేబినెట్ లో చర్చించకపోవడంపై ఆగ్రహం చెందారు. అసమ్మతివాదులుగా ముద్రపడిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీనియర్ మంత్రి డీల్ రవీంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మలు తరచూ సమావేశమవుతున్నారు.  అప్పుడప్పుడు వీరికి ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జతవుతున్నారు. ఇందులో డీఎల్ రవీంద్రారెడ్డి తన అసమ్మతిని ఎక్కడపడితే అక్కడ వెల్లగక్కుతూనే ఉన్నారు.

దీంతో పాటు వివిధ పథకాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాహూల్ తో ఓ వైపు భేటీకి సమాయత్తమవుతున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సీఎంగా కిరణ్ కుమార్ పేరు ప్రతిపాదించినప్పటినుంచి గూడుకట్టెకున్న అసమ్మతి మెల్లగా బలపడింది. తాజాగా జరిగిన అసమ్మతి భేటీలకు రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి హాజరయ్యారు. ఓ సీనియర్ మంత్రే తొలుత చిరంజీవికి ఫోన్ చేసి వీలుంటే కలవాలనుకుంటున్నట్లు చెప్పటంతో ఆయన భోజనానికి ఆహ్వానించారు.

కాగా చిరంజీవి  నివాసంలో జరిగిన విందు సమావేశం కాంగ్రెస్ వర్గల్లో కలకలం సృష్టిస్తున్నది. ఇది సాధారణ సమావేశమేనని ఇందులో పాల్గొన్న మంత్రులు కొట్టిపారేస్తుండగా ఇటివలి కాలంలో పథకాలు ఏకపక్షంగా ప్రవేశ పెడుతున్నారంటున్న వివిధ పథకాల పై చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందరి లక్ష్యం  ఒక్కటే...... కిరణ్ కు వ్యతిరేకంగా పోరాడడమే. డిప్యుటీ సీఎం దామోదర రజనర్సింహ కూడా గతం నుండే ఆగ్రహంతో ఉన్నారు. మంత్రులు ఒక్కక్కరుగా సీఎంకు వ్యతిరేకంగా సమావేశం కావడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: