ఇళ్లు, ఆఫీసు, ఆస్ప‌త్రి, వ్యాపార, వాణిజ్య సముదాయాలు.. ఇలా ప్రతి చోట శానిటైజర్ వాడ‌కం కామ‌న్ అయిపోయింది. కరోనా నుంచి రక్షణ పొందేందుకు దీని వాడకం పెరిగిపోయింది. అయితే, దీంతో ప్రాణాలు కాపాడుకోవడం ఎలా సాధ్య‌మో ప్రాణాలు పోవ‌డం కూడా సాధ్య‌మే.  తాజాగా విజయవాడ ఘటన ద్వారా ఇది రుజువైంది. క‌రోనా వ‌ల్ల మనిషి జీవితంలో ఓ భాగమైపోయిన శానిటైజర్ స‌రిగా వాడ‌క‌పోతే వైరస్‌ కంటే ప్రమాదకరంగా మారుతున్న త‌రుణంలో...నిపుణులు ప‌లు జాగ్ర‌త్త‌లు సూచిస్తున్నారు.




అలసత్వం ప్రదర్శిస్తే  అగ్నిప్రమాదాలు....అశ్రద్ధ చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటున్న నిపుణులు ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం రెండు రకాల శానిటైజర్లను మాత్రమే వినియోగించాలని స్ప‌ష్టం చేస్తున్నారు. అందులో ఒకటి ఐసో ప్రొపైల్‌ ఆల్కహాల్‌(ఐపీఏ), రెండోది ఇథనాల్‌ ఆధారిత శానిటైజర్‌. ఈ రెండింటికీ మండే స్వభావం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ సభ్యులు, ప్రముఖ ఫార్మకాలజిస్టు డాక్టర్‌ ఎ. సంజయ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఐపీఏ ఆధారిత శానిటైజర్‌లో 1.45 శాతం గ్లిజరాల్‌, 0.125 శాతం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, 75 శాతం ఆల్కహాల్‌ ఉంటుందని, ఇక ఇథనాల్‌ ఆధారిత శానిటైజర్‌లో 1.45 శాతం గ్లిజరాల్‌, 0.125 శాతం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ 80 శాతం ఇథనాల్‌ ఉంటుందని వివరించారు. ఈ రెండు రకాల శానిటైజర్లు మండే స్వభావం కలిగివనే. దీంతో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.




శానిటైజర్లు, ఇతర కరోనా నుంచి రక్షించే పరికరాల విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు సబ్బులనే వినియోగించడం మంచిదని సూచిస్తున్నారు. ఒక‌వేళ శానిటైజ‌ర్లు వాడ‌కం త‌ప్ప‌నిస‌రైతే, శానిటైజర్లను వంట గదులు, ఆక్సిజన్‌, గ్యాస్‌ సిలిండర్లకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా దవాఖానల్లో లీటర్ల కొద్దీ నిల్వచేస్తారు. అలాంటప్పుడు ప్రత్యేక గదుల్లో భద్రపర్చడం ఉత్తమం. పెట్రోల్‌ బంకుల్లో సైతం శానిటైజర్లను పంపులకు దూరంగా ఉంచాలి. చేతులకు శానిటైజర్‌ రుద్దకున్న వెంటనే వంట గదిలోకి వెళ్లి స్టౌ వెలిగించడం, కరెంటు స్విచ్‌లు వేయడం, రోగులకు ఆక్సిజన్‌ పెట్టడం చేయకూడద‌ని తేల్చిచెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: