ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొందరు అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. కొందరు అధికారులు కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా విలువ ఇవ్వకపోవడంతో రాజకీయంగా ఇది సంచలనం అయింది. దీనిపై చాలా మంది ఎమ్మెల్యేలు మీడియా ముందు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా నెల్లూరు జిల్లా అధికారులపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

నిన్న దేశమంతా గణతంత్ర దినోత్సవాల్లో సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు.  జిల్లాలో మాత్రం ఎమ్మెల్యేలకు ఆ సంతోషం దక్కలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యేలకి చోటు దక్కలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు.  మాకు అర్హత లేదా? అని ఆయన నిలదీశారు. దీనికి మేము సిగ్గుపడాలో, ఏమి చేయాలో అర్థం కావడంలేదు అని అన్నారు. నెల్లూరులో రిపబ్లిక్ డే పెరేడ్ జరిగితే, ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేదు అని మండిపడ్డారు. 40 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నాకు చాలా సిగ్గుచేటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

అధికారుల నిర్లక్ష్యమా లేక అహంకారమా? అని ప్రశ్నించారు.  ఎందుకు మమ్మల్ని పిలవలేదు అంటే, అధికారుల దగ్గర సమాచారం లేదు అని అన్నారు. జిల్లా ప్రోటోకాల్ అధికారిని అడిగితే, మేము చిన్నవాళ్ళం, మీకు సమాదానం చెప్పలేం అన్నారు అని అన్నారు. అధికారులు... మీ ఇన్విటేషన్లు ఉన్నాయి. పక్కన పెట్టమన్నారని చెప్పారు అని... ఇంత నిర్లక్ష్యంతో అధికారులు జిల్లాలో ఉండడం గర్హనీయం అని విమర్శలు చేసారు. దీనిపై రాష్ట్ర ప్రివిలీజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాను అని ఆయన అన్నారు. రాజ్యాంగ పరంగా నన్ను రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనకుండా ఆమానించిన అధికారులపై కేసులు వేస్తాను అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: