వంగవీటి రాధాకు కొడాలి నాని, వంశీ మంచి స్నేహితులు. ఒకే ప్రాంతం నుంచి వచ్చినవారు కావడం. గతంలో రాధా కూడా వైసీపీలో ఉండటంతో.. ఆయనతో ఇంకా వారిద్దరికీ సత్సంబంధాలున్నాయి. అందుకే వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో రాధాతో కలసి పాల్గొన్నారు మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. స్నేహితుడికోసం వారు వెళ్లారు. అక్కడ తన హత్యకోసం రెక్కీ జరిగిందని రాధా సంచలన కామెంట్లు చేయడంతో.. అందరూ షాకయ్యారు. రాధాకు ఊరటనిచ్చిన వంశీ, నాని, అదే విషయాన్ని సీఎం జగన్ వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంత్రి నాని చొరవతోనే.. రాధాకు గన్ మెన్ల సంఖ్యను పెంచేలా సీఎం ఆదేశాలిచ్చారు. అయితే రాధా తనకు గన్ మెన్లు వద్దని తిప్పి పంపించేశారు. ఫైనల్ గా రాధా హత్యకోసం రెక్కీ జరిగిందని ఆరోపణలున్నా కూడా ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. కొంతమంది అనుమానితుల్ని విచారించినా.. తర్వాత ఏమీ లేనట్టు తేల్చి చెప్పారు.

అంతా బాగానే ఉంది కానీ.. ఇన్నాళ్లకు చంద్రబాబు మళ్లీ రాధాను కలిశారు. 2019 ఎన్నికల సమయంలో పార్టీతో రాధాకు విభేదాలొచ్చాయని అంటున్నారు. ఆ తర్వాత ఆయన కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. తీరా ఇప్పుడు రాధా రాజకీయంగా టాక్ ఆఫ్ ది స్టేట్ కావడంతో చంద్రబాబు మళ్లీ ఆయన దగ్గరకు వచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెక్కీ చేసినవారెవరో తేల్చాలని, వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో అసలు నాని, వంశీ పరిస్థితి ఏంటి..? రాధాకోసం సీఎం జగన్ వద్దకు రాయబారం నడిపిన వీరిద్దరూ చంద్రబాబు ఎంట్రీతో సైలెంట్ అయిపోయారు. అసలు రాధా వైసీపీలోకి వచ్చేస్తారని, నాని, వంశీ కలయికతో అది రుజువైందని కూడా ఆమధ్య ప్రచారం జరిగింది. కానీ ఆయన నోరు మెదపలేదు. ఇటునుంచి చంద్రబాబు మాత్రం హుషారు అయ్యారు. దీంతో నాని, వంశీకి ఇప్పుడు డైలాగులు లేకుండా పోయాయి. రాధాని కలసిన చంద్రబాబు.. ప్రభుత్వంపై విమర్శలు కూడా ఎక్కుపెట్టారు. ఈ దశలో అసలు రాధా వ్యూహం ఏంటనేది తేలడంలేదు. మరింత కాలం వేచి చూసి తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటారా..? లేక టీడీపీలోనే ఉంటారా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: