కుల‌, మ‌తాల‌కు అతీతంగా స‌మాన‌త్వ సిద్ధాంతానికి పాటుప‌డిన జ‌గ‌ద్గురు శ్రీ రామానుజాచార్యుల వెయ్యేండ్ల వేడుక‌లకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింత‌ల్ లో శ్రీ‌రామ‌న‌గ‌రం  అంగ‌రంగ వైభ‌వంగా ముస్తాబ్ అయింది. శ్రీ‌రామ‌నుజార్య స‌హ‌స్రాబ్ది స‌మారోహం పేరుతో ఈరోజు నుంచి ఫిబ్ర‌వ‌రి 14 వ‌ర‌కు నిర్వ‌హించే ఈ వేడుక‌ల్లో స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని జాతికి అంకిత‌మం చేయ‌నున్నారు. అదేవిధంగా 216 అడ‌గుల ఎత్తున నిర్మించిన రామానుజాచార్య విగ్ర‌హాన్ని వైభ‌వంగా ఆవిష్క‌రించ‌నున్నారు. స్వ‌యంగా త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌హ‌స్రాబ్ది వేడుక‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ఉత్స‌వాల్లో భాగంగా భారీ ఎత్తున ల‌క్ష్మీనారాయ‌ణ మ‌హాయ‌జ్ఞం కొన‌సాగనున్న‌ది. 108 దివ్వ దేశాల ప్ర‌తిష్టాప‌న, కుంభాభిషేకం, స్వ‌ర్ణమ‌య శ్రీ‌రామానుజ ప్ర‌తిష్ట, స‌మ‌తామూర్తి లోకార్ప‌ణ జ‌రుగ‌నున్న‌ది. 12 రోజుల మ‌హాక్ర‌తువులో ప్ర‌ధాన‌మైన యాగ‌శాల‌లో య‌జ్ఞాల‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. 1035 కుండాల‌లో మ‌హాయ‌జ్ఞం జ‌రుగ‌నున్న‌ది. ఈ మ‌హాయాగాన్ని నిర్వ‌హించేందుకు 5వేల మంది రుత్వికులు ఆశ్ర‌మానికి చేరుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌,  త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌,  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల‌తో స‌హా అమెరికా నుంచి కూడా వ‌చ్చారు. యాగానికి అవ‌స‌రం అయిన ప‌దివేల పాత్ర‌ల‌ను రాజ‌స్థాన్ నుంచి తెప్పించారు. యాగ‌శాల‌ను వాలంటీర్లు అంద‌మైన రంగ‌వ‌ల్లుల‌తో తీర్చిదిద్దారు.

ఈ వేడుక‌ల‌లో సేవ‌లు అందించ‌డానికి వికాస త‌రంగిణి సంస్థ ఆధ్వ‌ర్యంలో సుమారు 12వేల మంది వాలంటీర్లు వివిధ ద‌శ‌ల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించ‌నున్నారు. అమెరికాలోని 15 రాష్ట్రాల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లోని 20 జిల్లాలతో స‌హా మ‌రొక 18 రాష్ట్రాల నుంచి సేవ‌కులు వ‌చ్చారు. యాగ‌శాల‌, స‌మ‌తామూర్తి విగ్ర‌హం, ఆహార‌శాల‌లు, మ‌రుగుదొడ్లు వంటి వేర్వేరు చోట్ల వాలంటీర్లు సేవ‌లందించ‌నున్నారు. రామానుజాచార్య ఉత్స‌వాల‌కు రాష్ట్రప‌తి, ప్ర‌ధానితో పాటు కేంద్ర‌మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, గ‌వ‌ర్న‌ర్లు విశిష్ట అతిథులుగా హాజ‌రు కానున్న‌ట్టు చిన‌జీయ‌ర్ స్వామి వెల్ల‌డించారు.

సామాన్యుల నుండి ధీమాన్యుల వ‌ర‌కు అన్ని ర‌కాల సేవ‌లందిస్తూ స‌మ‌తామూర్తి స్ఫూర్తిని ఆవిష్క‌రించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. స‌మ‌తామూర్తి విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌తో పాటు స‌హ‌స్రాబ్ది వేడుక‌ల‌కు ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన పోలీస్ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసిన‌ది. సుమారు 7వేల మంది పోలీసులు స‌మ‌తామూర్తి కేంద్రంలో 24 గంట‌ల‌పాటు ప‌హారా కాయ‌నున్న‌ట్టు సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర తెలిపారు. పోలీసులు పూర్తిగా స‌మ‌తామూర్తి కేంద్రాన్ని త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. భ‌ద్ర‌త‌, భ‌క్తుల సేవ కార్య‌క్ర‌మాల‌పై పోలీసులు ఉన్న‌తాధికారులు సిబ్బందితో స‌మీక్షించిన చిన్న‌జీయ‌ర్ స్వామి పోలీసులు, వాలంటీర్ల స‌మ‌న్వ‌యంతో క‌లిసి ప‌ని చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: