ఏపీలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూవాడా పార్టీ శ్రేణులు వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశాయి. పార్టీ కార్యాలయాల్లో కేక్ కటింగ్ లు, జెండా ఆవిష్కరణలు ధూమ్ ధామ్ గా జరిగాయి. కేంద్ర పార్టీ కార్యాలయంలో కూడా వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ ఒక్కటే లోటు. సీఎం జగన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన కార్యకర్తలు, నేతల్లోకి రాలేదు. అసలు జగన్ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎందుకు ఆవిర్భావ వేడుకల రోజు బయటకు రాలేదు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

జగన్ కేవలం సోషల్ మీడియా ద్వారానే నేతలు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అటు వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన సందేశం ఇవ్వకపోవడం విశేషం. ఇక పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కూడా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అంతే కాని మంత్రులెవరూ అక్కడికి రాలేదు. అసలు మంత్రులంతా స్థానికంగా సంబరాలు చేసుకున్నారే కానీ, అందరూ కలసి ఓ చోట పార్టీ పండగ జరుపుకోలేదు.

జగన్ జనంలోకి వచ్చేనా..?
పాదయాత్ర సమయంలో జగన్ ని జనం దగ్గరగా చూశారు. అధికారంలోకి వచ్చాక ఆయన జనంలోకి రావడం అరుదు.  అప్పుడప్పుడు సంక్షేమ పథకాల ప్రారంభం సమయంలో కూడా సభా వేదికలపైనుంచి అభివాదం చేసుకుంటూ వెళ్లేవారు జగన్. వరదల సమయంలో జనంతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ షరా మామూలే. అదిగో రచ్చబండ, ఇదిగో జనంలోకి యాత్ర అంటూ అంటున్నారే కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. జనంలోకి కాదు కదా, అసలు పార్టీ నాయకులకి కూడా జగన్ సమయం కేటాయించలేనంత బిజీగా మారిపోయారు. ఎమ్మెల్యేలు, మంత్రులకి కూడా వ్యక్తిగత అపాయింట్ మెంట్ లు చాలా కష్టం అని సమాచారం. ఇక మిగతావారి పరిస్థితి ఏంటి..? ఈ దశలో జగన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి కూడా హాజరు కాకపోవడంతో అసలు సంగతి ఏంటా అని అనుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉన్నా కూడా ఓ గంట సమయం కేటాయించుకుంటే సరిపోతుంది కదా అని సలహా ఇస్తున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. పార్టీ ఆవిర్భావ వేడుకలకు జగన్ హాజరు కాకపోయినా పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: