స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోడానికి భారత్ సిద్ధమవుతోంది. ఈ సందర్భంలో ఈ ఏడాది వేడుకలను సరికొత్తగా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ వేడుకలు జరిగినా.. ఆరోజు అందరి దృష్టీ ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలపైనే ఉంటుంది. అక్కడ ప్రధాని జెండా ఎగురవేస్తారు, ప్రసంగిస్తారు. అక్కడ జరిగే పరేడ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే ఆ పరేడ్ లో ఈ ఏడాది కొత్తగా గన్ సెల్యూట్ ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఎందుకంటే భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 21 తుపాకులను ఇక్కడ గన్ సెల్యూట్ కోసం ఉపయోగించబోతున్నారు. ఈ అధునాతన తుపాకులను భారత రక్షణ పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది. అడ్వాన్స్‌డ్‌ టోవుడ్‌ ఆర్టిలరీ గన్‌ సిస్టమ్‌ ఫిరంగులను గన్ సెల్యూట్ లో వినియోగించబోతున్నట్టు భారత రక్షణశాఖ సెక్రటరీ అజయ్‌ కుమార్‌ వెల్లడించారు.

ఎర్రకోటలో జరిగే గన్ సెల్యూట్ కోసం ఇప్పటి వరకూ బ్రిటిష్ తుపాకులనే వాడటం విశేషం. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇంకా వేడుకలకోసం మనల్ని పాలించి వెళ్లిన బ్రిటిష్ తుపాకుల్నే వాడటం నేతలకు నచ్చలేదు. అందుకే భారత్ తయారీ తుపాకులను గన్ సెల్యూట్ కోసం వాడాలనుకుంటున్నారు. ఈ ఏడాది స్వదేశీ పరిజ్ఞానంతో, డీఆర్డీవో సంస్థ తయారు  చేసిన ఏటీఏజీఎస్‌ తుపాకులను గన్ సెల్యూట్ కోసం వాడబోతున్నారు.

సాధారణంగా ఈ తుపాకులను సరిహద్దుల్లో ఉపయోగిస్తుంటారు. అయితే వీటిలో కొన్ని మార్పులు చేసి ఈసారి గన్ సెల్యూట్ కోసం సిద్ధం చేశారు. పుణె లోని డీఆర్డీవో శాస్త్రవేత్తలతోపాటు ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ లో భాగంగా దేశీయంగా కూడా ఆయుధాలను భారత్ రక్షణ శాఖ అభివృద్ధి చేస్తోంది. భారత సైన్యంలో ఉపయోగిస్తోన్న పాత ఫిరంగుల స్థానంలో వీటిని క్రమక్రమంగా ప్రవేశ పెడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు డీఆర్డీవో 2013లో శ్రీకారం చుట్టింది. ఈ తుపాకుల తో 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించవచ్చు. ప్రస్తుతం ఈ తుపాకులే ఇప్పుడు ఎర్రకోటలో జరిగే 75వ స్వాతంత్ర దినోత్సవాల్లో హైలెట్ కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: