పోయిన ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన చిన్న తప్పే ఇపుడు తలనొప్పిగా తయారైంది. టీడీపీలో ఉన్న రఘురామకృష్ణంరాజు వైసీపీలో చేరి పోటీచేసి గెలిచారు. నరసాపురంలో గెలిచిన కొద్దిరోజులకే జగన్-ఎంపీ మధ్య ఏదో విషయంలో చెడింది. అప్పటినుండి వైసీపీలోనే ఎంపీ తిరుగుబాటు నేతగా మారిపోయారు. ప్రతిచిన్న విషయంలోను ప్రభుత్వంతో పాటు జగన్ కు తీవ్రంగా వ్యతిరేకిస్తు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు.

మరి రాజు బతిమలాడుకుంటే జగన్ సరే అని వైసీపీలో చేర్చుకున్నారో లేకపోతే జగన్ పిలిచి రాజుకు టికెట్ ఇచ్చారో తెలీదు. ఏదేమైనా ఇపుడు ఎంపీ జగన్ కు ఏకుమేకై కూర్చున్నారు. ఇదే పద్దతిలో నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆనం రామనారాయణరెడ్డి విషయంలో కూడా జరిగింది. అయితే రాజుకు ఆనంకు తేడావుంది. అదేమిటంటే టీడీపీలో ఉన్న ఆనం వెంటపడితే సరే కానిమ్మని జగన్ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. అయితే తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుని అదేమీ జరగకపోవటంతో ఆనంలో అసంతృప్తి మొదలైంది.
                                       

వైసీపీ గెలవగానే తనను జగన్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆనం అనుకున్నారు. అయితే అలా జరగకపోవటమే కాకుండా తనకన్నా ఎంతో జూనియర్ అయిన అనీల్ కుమార్ యాదవ్ ను మంత్రివర్గంలోకి తీసుకోవటంతో ఆనంకు మండిపోయింది. ఇదే సమయంలో పార్టీ, ప్రభుత్వంలో కూడా తాను ఆశించినంతగా ప్రాధాన్యత దక్కకపోవటంతో అసమ్మతి వాదిగా మారిపోయారు.

బహుశా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టికెట్లు దక్కదని ఇద్దరు కన్ఫర్మ్ చేసుకున్నట్లున్నారు. అందుకనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇద్దరూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పార్టీలో ఉంటునే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతు ప్రతిపక్షాలకు  ఆయుధాలిస్తున్నారు. వీళ్ళని జగన్ ఏమీచేయలేకపోవటంతో వీళ్ళిద్దరు రెచ్చిపోతున్నారు. నిజానికి వీళ్ళిద్దరినీ పార్టీలో చేర్చుకుని టికెట్లివ్వటమే జగన్ చేసిన తప్పు. ఎందుకంటే పార్టీలో చేరకముందు వీళ్ళిద్దరు జగన్ను ఎన్నోసార్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ విషయం తెలిసికూడా జగన్ ఇద్దరినీ చేర్చుకోవటమే కాకుండా టికెట్లిచ్చి గెలిపించుకున్నారు. అప్పట్లో వీళ్ళని చేర్చుకోకుండా ఉండుంటే ఇపుడీ తలనొప్పులు ఉండేవికావు.మరింత సమాచారం తెలుసుకోండి: