హైదరాబాద్: వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లలో చేపట్టిన ఒక రోజు దీక్షా కార్యక్రమం విజయవంతం కోసం ఆ పార్టీ నేతలు సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన కేకే.మహేందర్ రెడ్డి, రాజ్ ఠాకూర్, నల్లా సూర్యప్రకాష్, రఘురాంతో పాటు నియోజక వర్గానికి చెందిన పలువురు నాయకులు గత కొన్ని రోజులుగా నియోజక వర్గంలోని ఇంటింటా తిరుగుతూ చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి విజయమ్మ సిరిసిల్లలో దీక్షను చేపట్టిందనీ వివరిస్తున్నారు.
విజయమ్మ దీక్షకు సంబంధించిన పోస్టర్ ను కూడా వైఎస్ఆర్ పార్టీ నేతలు ఆవిష్కరించారు. విజయమ్మ దీక్షను విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ పార్టీ నేతలు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తుండగా...టీఆర్ఎస్ పార్టీ మాత్రం విజయమ్మ దీక్షను అడ్డుకోవడానికి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నాడు నిరసన కార్యక్రమాలను నిర్వహించడానికి పిలుపునిచ్చింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సిరిసిల్ల చేనేత కార్మికులకు 2008లో ఇచ్చిన హామీలకు ఇప్పటి వరకు దిక్కు మొక్కు లేదనీ, తెలంగాణకు వైఎస్ కుటుంబం తీరనీ అన్యాయం చేసిందనీ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ఆరోపిస్తున్నారు.
చేసిందంత చేసి ఇప్పుడు సిరిసిల్ల చేనేత కార్మికులపై మొసలి కన్నీరు కారిస్తే ఎవరూ నమ్మరంటున్నారు. తెలంగాణపై స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పిన తరువాతనే విజయమ్మ సిరిసిల్లకు రావాలనీ, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో అడుగుపెట్టనివ్వబోమనీ హెచ్చిరించారు. తెలంగాణపై కేంద్రానికి లేఖ రాస్తే సిరిసిల్లలో మంగళహారతులతో విజయమ్మకు స్వాగతం పలుకుతామంటూనే రానివ్వకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అయితే, తెలంగాణకు విజయమ్మను రావద్దనడం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు సరికాదనీ, దీని వెనక రాజకీయ ఉద్దేశాలున్నాయనీ పద్మశాలి జాతీయ పరిషత్ నాయకుడు భాస్కర్ అంటున్నారు.
సిరిసిల్లలో చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి విజయమ్మ దీక్ష ఎంతోకొంత ఉపయోగపడుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. చేనేత శిల్పి పరంధాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాననీ హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఆ మాటకు కట్టుబడి లేడన్నారు. దీనితోనే కేటీఆర్కు చేనేత కార్మికులపై చేనేత శిల్పి పరంధాములుపై ప్రేమ ఎంత వుందో అర్థమవుతుందన్నారు. ఇదిలా ఉంటే, ఉస్మానియ విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు.
టీఆర్ఎస్ కేవలం తన ఉనికిని చాటుకోవడం కోసమే విజయమ్మ పర్యటనను అడ్డుకుంటున్నారనే వాదన రోజు రోజుకు బలపడుతోంది. విజయమ్మ సిరిసిల్ల దీక్షను రాజకీయ కోణంలో ఆలోచించవద్దని వైఎస్ఆర్ పార్టీనేతలు కోరుతున్నారు. మొత్తానికి సిరిసిల్లలో విజయమ్మ చేపట్టిన దీక్ష నేపథ్యంలో టీఆర్ఎస్ నిరసనల హోరు...వైఎస్ఆర్ పార్టీ నేతల ఇంటింటి ప్రచారంతో కరీంనగర్ జిల్లా హోరెత్తుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి