
పరిటాల రవి పేరు తెలియని వారుండరేమో.! అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల రవిది చెరగని ముద్ర. తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఆయన పనిచేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. అభిమానులంతా ఆయన్ను పులి అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన భార్య పరిటాల సునిత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేస్తున్నారు. పరిటాల రవి – సునితమ్మల కుమారుడు పరిటాల శ్రీరామ్ ఇప్పుడు పెళ్లిపీటలెక్కబోతున్నారు.
పరిటాల శ్రీరామ్ ఇప్పుడు యూత్ ఐకాన్. ఇప్పటికే శ్రీరామ్ కు అభిమాన సంఘాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం. ఇప్పటికే ఆయన జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. శ్రీరామ్ ను రాజకీయ ప్రవేశం చేయించి తాను విశ్రాంతి తీసుకోవాలని మంత్రి సునీత భావిస్తున్నారు. అంతేకాదు.. ఓ ఇంటివాడ్ని చేస్తే తన బాధ్యత నెరవేరినట్లవుతుందని భావించిన సునీత.. ఓ మంచి సంబంధం చూశారు.
శ్రీరామ్ పెళ్లి అక్టోబర్ 1వ తేదీన జరగనుంది. ఆయనకు కాబోయే భార్య పేరు ఆలం జ్ఞాన. శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలం ఆమె స్వస్థలం. ఆమె తండ్రి ఆలం వెంకటరమణ. తల్లి సుశీలమ్మ. ఆలం వెంకటరమణ AVR కన్ స్ట్రక్షన్స్ యజమాని. రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది. వెంకటరమణ కుటుంబం కూడా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తోంది. దీంతో వారిరువురి కుటుంబాల మధ్య బంధం ఏర్పడుతోంది.
ఈనెల 10వ తేదీన హైదరాబాద్ లో శ్రీరామ్ – జ్ఞానల నిశ్చితార్థం జరగనుంది. పెళ్లి మాత్రం అనంతపురం జిల్లాలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీరామ్ పెళ్లిని స్థానికంగానే చేయాలంటూ అభిమానులు ఎంతోమంది సునీతను కోరినట్లు సమాచారం. వారి వినతిని కాదనలేని సునీత.. అనంతపురంలోనే పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరుకానున్నారు.