హైదరాబాద్: నిన్న, మొన్నటి వరకు ఎడముఖం, పెడముఖంగా ఉన్నటు వంటి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ ఒకటయ్యారు. గత కొన్ని నెలలుగా దామోదర్, జగ్గారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. వీరిద్దరి మధ్యన వచ్చిన మనస్పర్ధలు జిల్లా అధికారులకు తలనొప్పిగా మారగా... కార్యకర్తలూ విడిపోయారు. వివరాల్లోకి వెళ్లితే.... మెదక్ జిల్లాలోని రామచంద్రాపురం ప్రాంతంలోని ఓ స్థలం విషయంలో దామోదర్, జగ్గారెడ్డి మధ్యన అగాధం ఏర్పడినట్లు తెలుస్తోంది. దామోదరం కోసం జిల్లాలో తాను ఎంతో కష్టపడుతున్నా...తనను ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నాడనే ఆవేదనతో జగ్గారెడ్డి దూరమైనట్లు సమాచారం.
డిప్యూటీ సీఎం నుంచి దూరమైన జగ్గారెడ్డికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ హోదా అయిన ప్రభుత్వ విప్ పదవీని అప్పగించారు. ముఖ్యమంత్రి రోశయ్యను మార్చిన సందర్భంలోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు అప్పట్లో జోరుగా వార్తలొచ్చాయి. అయితే, అనూహ్యామైన పరిస్థితుల్లో అధిష్టానం కిరణ్‌ను సీఎంగా చేసింది. అప్పటి నుంచీ కిరణ-దామోదరం మధ్యన చెప్పుకోదగ్గ సంబంధాలు లేకుండా పోయాయి. కిరణ్‌ను సీఎంగా చేసిన తరువాత డిప్యూటీ సీఎంను తెలంగాణకు ఇచ్చారు. అప్పుడు కూడా ఇదే జిల్లాకు చెందిన గీతారెడ్డిని డిప్యూటీ సీఎం చేస్తారనీ జోరుగా ప్రచారం జరిగింది. చివరి క్షణంలో దామోదరాన్ని డిప్యూటీ సీఎం పదవీ వరించింది.
దామోదరం డిప్యూటీ సీఎంగా కావడానికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీలో మకాం వేసి తనవంతు ప్రయత్నం చేశారు. వీరికి ఢిల్లీలో ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, కేంద్రానికి చెందిన మరో సీనియర్ మహిళా నాయకురాలు సహకరించారని సమాచారం. దామోదర్ డిప్యూటీ సీఎం అయిన కొన్ని రోజుల పాటు జగ్గారెడ్డి-దామోదరం అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఒకర్ని విడచి ఒకరు ఉండేవారు కారు. కానీ, ఓ స్థలం ఇద్దరి మధ్యన దూరాన్ని పెంచింది. దామోదరానికి వ్యతిరేకంగా జగ్గారెడ్డి పని చేశారు. దీనితో అప్పటి వరకు ఒకటిగా ఉన్న జిల్లాలోని జగ్గారెడ్డి, దామోదరం వర్గాలు రెండుగా చీలిపోయాయి.
డిప్యూటీ సీఎంపై తిరుగుబాటు జెండాను ఎగరవేసిన జగ్గారెడ్డిని సీఎం కిరణ్ దగ్గరకు తీశారు. జిల్లా అధికారులందరూ జగ్గారెడ్డి చెబితే వినే విధంగా చేశారు. అయితే, కేవలం ఎమ్మెల్యేగా ఉండటం వల్ల లాభం లేదనీ, జగ్గారెడ్డికి ఏదైనా ప్రోటోకాల్ పదవీ ఉంటేనే మెదక్ జిల్లాలో డిప్యూటీ సీఎంకు చెక్ పెట్టవచ్చనే ఆలోచనకు వచ్చిన సీఎం కిరణ్, జగ్గారెడ్డిని ప్రభుత్వ విప్ గా నియమించారు. జగ్గారెడ్డి కూడా సీఎం వర్గంగా ముద్రపడ్డారు. డిప్యూటీ సీఎంతో అంటీముట్టనట్లుగా వ్యవహారిస్తూ వచ్చారు. దీని వల్ల అధికారులకు ఇబ్బంది కలిగింది. కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. అయితే, సోమవారం నాడు జరిగిన రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దామోదర్, జగ్గారెడ్డి ఇద్దరూ పాలుపంచుకున్నారు. రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కలిసి మొక్కలను నాటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంచిపెట్టారు.
ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజంతా జగ్గారెడ్డి, దామోదరం చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. చాలా నెలల తరువాత జగ్గారెడ్డి, దామోదరం ఒకే కార్యక్రమంలో ఎంతో హుషారుగా పాల్గొనడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకటైన తమ నాయకులను చూసి కార్యకర్తలు మాత్రం సంతోషంలో మునిగితేలారు. ఓ స్థలం ఇద్దర్ని దూరం చేస్తే, రాజీవ్ గాంధీ జయంతి వేడుక ఒకటిగా చేసిందన్నమాట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి