హైదరాబాద్: అందరూ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఓట్ల లెక్కింపు మరి కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది. గంటల్లోనే ఫలితాలు తెలుస్తాయి.  అభ్యర్థుల జాతకం తేలిపోనున్నది.  శుక్రవారం ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతోంది. దీని కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతుండటంతో అన్ని పార్టీలలో భయం పుంజుకుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్న మరి కొంత సేపట్లో తమ భవిష్యత్ తేలిపోతుండటంతో అందరిలో ఏదో తెలియని టెన్షన్.  జనరల్ ఎన్నికలకు ముందుగా రాష్ర్టంలోని 12 జిల్లాలో18అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలో ఈ ఎన్నికలు జరుగుతుండటంతో ఉప ఎన్నికలను అందరూ సెమీ ఫైనల్గా భావిస్తున్నారు. రాష్ర్టంలోని రాజకీయాలను మార్చే ఈ ఎన్నికలపై యావత్ దేశమే కాకుండా, ప్రపంచంలో ఉన్న యావత్ తెలుగు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఎలక్ట్రానిక్ యంత్రాలు కావడంతో గంటల వ్యవధిలోనే ఫలితాలు వస్తాయి.  మొదటి రెండుమూడు రౌండ్లలోనే గెలుపు ఎవరిదనేది ఇట్టే చెప్పొచ్చు. రాష్ర్ట చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో అనేక మంది రాజకీయ మనుగడ ఆధారపడి వుంది. అందుకే అందరికీ ఈ ఉప ఫలితాలపై ఉత్కంఠ. ముందు నుంచీ అందరూ అనుకుంటున్నట్లు, సర్వేలు చెబుతున్నట్లుగా వైఎస్ఆర్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటే రాష్ర్ట రాజకీయాల్లో అనేక పరిణామాలు చేసుకోవడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: