మొన్నటి ఎన్నికల్లో
ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశంపార్టీ జగన్మోహన్ రెడ్డిపై కసి తీర్చుకునే పనిలో పడినట్లుంది.
రిజర్వేషన్ల విషయంలో కాపులను జగన్ పైకి రెచ్చ గొడుతోంది. అదికూడా ఓ పద్దతి ప్రకారం
కాపుల్లో జగన్ పై వ్యతిరేకత పెరిగేందుకు వ్యూహం పన్నినట్లే కనబడుతోంది. తాజాగా
మాజీ మంత్రి కళా వెంకట్రావు చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనంగా ఉంది. జగన్ కాపుల
నోటికాడ కూడు లాగేస్తున్నాడంటూ ఆరోపణలు చేయటం గమనార్హం.
2014 ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తానని హామీ ఇచ్చింది చంద్రబాబునాయుడు. ఆ పని చేయలేక చేతులెత్తేశారు. అగ్రవర్ణాల్లోని పేదలకు పదిశాతం రిజర్వేషన్ కల్పిస్తు కేంద్రం చట్టం చేసింది. వెంటనే చంద్రబాబు ఆ పదిశాతంలో ఓ 5 శాతాన్ని కాపులకు రిజర్వేషన్ కల్పించబోతున్నట్లు ప్రకటించేశారు. నిజానికి కాపులను బిసిల్లో చేర్చటం, కేంద్రం కల్పించిన 10 శాతంలో 5 శాతాన్ని కాపులకు కేటాయించటం రెండూ తప్పే. ఎందుకంటే రిజర్వేషన్లది కేంద్రప్రభుత్వం పరిధిలోనిదే కానీ రాష్ట్రాల పరిధిలో లేని అంశం.
కేవలం 2014లో ఓట్ల కోసమే చంద్రబాబు తప్పుడు హామీలిచ్చారు. ఆ తప్పుడు హామీలను నమ్మిన కాపులు కూడా చంద్రబాబుకు ఓట్లేశారు. సరే అదంతా గతం. మొన్నటి ఎన్నికల్లో ఇదే కాపుల రిజర్వేషన్ అంశం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట బహిరంసభలో జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చింది. రిజర్వేషన్ల విషయంపై జగన్ మాట్లాడుతూ కేంద్రపరిధిలోని అంశం కాబట్టి తాము తప్పుడు హామీలివ్వలేనంటూ బహిరంగంగానే ప్రకటించారు. బిసిలకు ఇబ్బంది లేని విధంగా కాపులకు న్యాయం చేస్తానని కూడా చెప్పారు.
ముందు జగన్ ప్రకటనపై మండిపడినా తర్వాత నిజాయితీని గుర్తించిన కాపు సామాజికవర్గం వైసిపికి మద్దతుగా నిలిచింది. దాంతో ఇటు టిడిపి అటు జనసేన అభ్యర్ధులిద్దరూ అడ్రస్ లేకుండా పోయారు. అప్పటి నుండి టిడిపికి జగన్ పై మండిపోతోంది. ఎలాగైనా సరే కాపులను జగన్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అంటే చంద్రబాబు చేసిన మోసానికి కాపులు బుద్ధి చెప్పినా ఇంకా టిడిపికి మాత్రం బుద్ది వచ్చినట్లు లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి