విద్యార్థులను స్కూళ్లకు పంపాలంటే భయపడుతున్నారు తల్లిదండ్రులు.  ఫిట్‌నెస్‌ లెస్‌ బస్సులతో డేంజర్‌ హారన్‌లు మోగుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి నడుస్తున్న స్కూల్‌ బస్సులు ప్రాణ సంకటంగా మారాయి. స్కూల్‌ బస్సుల్లో పిల్లలకు అసలు భద్రత ఉందా..? ఏదైనా ప్రమాదం జరిగితేనే కళ్లు తెరుస్తున్నారు అధికారులు. వేములవాడ బస్సు ప్రమాదం తర్వాత.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిట్‌లెస్‌ బస్సులపై కొరడా ఝళిపిస్తున్నారు.

వేములవాడ బస్సు ప్రమాదంలో.. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పయారు. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్‌ లేదని అధికారులు గుర్తించారు. ఈ పని ముందే చేసి ఉంటే చిన్నారుల ప్రాణాలు పోయేవి కాదు. ఒక వేములవాడలోనే కాదు... రాష్ట్రంలో రోజుకో ప్రాంతంలో స్కూల్ బస్సులు ప్రమాదాలకు  గురవుతున్నా ఇటు రవాణా శాఖ కానీ, అటు విద్యా శాఖ కానీ కళ్లు తెరవడం లేదు. డ్రైవర్ల నిర్లక్ష్యం అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 50 నుంచి 60 శాతం విద్యాసంస్థల బస్సులకే ఫిట్‌నెస్‌ ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఫిట్‌నెస్ లేని బస్సులు ఎన్నో తిరుగుతున్నాయి. స్కూల్ బస్సులను మూడు నెలలకోసారి తనిఖీ చేయాలన్న నిబంధనను  అధికారులు పట్టించుకోవడం లేదు. పాతబడ్డ బస్సులు, అనుమతి లేని బస్సులను వాడుతూ స్కూల్ యాజమాన్యం పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతోంటే అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేముల వాడ ప్రమాదం తర్వాత కూడా నల్గొండ  జిల్లాలో స్కూల్ యాజమాన్యాలు, రవాణా శాఖ అధికారులు కళ్లు తెరవడం లేదు. ఫిట్ నెస్ లేని బస్సుల్లో ప్రమాదకరపరిస్థితుల మధ్య విద్యార్ధులు ప్రయాణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ముప్పై మందికి మాత్రమే సరిపోయే బస్సులో డెబ్బై మందిని ఎక్కిస్తూ స్కూల్ యాజమాన్యాలు విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. 


ఆదిలాబాద్‌లో ఫిట్‌లెస్‌ బస్సులపై  అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. తాజాగా జరిగిన ప్రమాదం తర్వాత  జిల్లాలో రవాణాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి స్కూల్ బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫిట్ నెస్ లేని బస్సులను, నిబంధనలకు అనుగుణంగా లేని బస్సులను సీజ్ చేస్తున్నారు. ఇన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నిజమాబాద్‌లో రవాణా శాఖ అధికారులు కళ్లు తెరవడం లేదు. ఫిట్ నెస్ లేని బస్సుల సీజ్ కు చర్యలు తీసుకోవడం లేదు. డ్రైవర్ మద్యం తాగి ఫిట్ నెస్ లేని బస్సును నిర్లక్ష్యంగా నడపడమే వేములవాడ బస్సు ప్రమాదానికి కారణం. నిజామాబాద్ లోనూ స్కూల్ బస్సుల తీరు ఇలాగే ఉంది. అనేక చోట్ల పాఠశాలలు ఫిట్ నెస్ లేని బస్సులను నడుపుతున్నాయి. సామర్థ్యానికి మించి పిల్లలను ఇలాంటి బస్సులో ఎక్కించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కరీంనగర్‌లో స్కూల్, కాలేజీ బస్సులపై తనిఖీలు జరుగుతున్నాయి. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకున్న బస్సులకు అధికారులు ఫైన్ వేశారు. కాలేజీ బస్సులకు తనిఖీలు నిర్వహించి డ్రైవింగ్‌ లైసెన్స్, ఇతర పత్రాలను పరిశీలించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో బస్సులు మోటార్ వెహికిల్ నిబంధనలు పాటించడం లేదు. ఇప్పటి కైనా అధికారులు తక్షణమే స్పందిస్తే రాబోయే కాలంలో జరిగే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: