దసరా ఉత్సవాల కోసం బెజవాడ కనక దుర్గ ఆలయం ముస్తాబవుతోంది. ఇలాంటి ప్రత్యేక ఉత్సావాల సమయంలో వీఐపీల తాకిడి చాలా ఉంటుంది. ప్రత్యేక దర్శనాల కోసం సిఫారసులూ బాగా వస్తాయి. అధికారానికి దగ్గర ఉన్నవారు, పలుకుబడి ఉన్నవారి కోసం సామాన్య భక్తులు ఇబ్బందులుపడాల్సి వస్తుంటుంది. అయితే ఈసారి అలాంటిది జరగనివ్వబోమని ఏపీ మంత్రులు చెబుతున్నారు.


దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఇబ్బండి కలుగకుండా ఎంత ఖర్చైనా పెట్టి సౌకర్యాలు కల్పిస్తున్నారు. సామాన్య భక్తుల శీఘ్ర దర్శనం కోసం ఈసారి విఐపి పాసులను కుదించేశారు. దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


ప్రభుత్వం తరపున ఖర్చు చేస్తున్న ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదవ తారీఖు మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. పోలీస్‌, శానిటేషన్‌, గుడి సిబ్బంది, ఫైర్‌ సిబ్బందితో కలిసి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నారు. 125 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మోడల్‌ గెస్ట్‌ హౌస్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నారు.


భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్‌ నిబంధనల అమలుతో పాటు వరదనీరు ఎక్కువగా ఉండడంతో ఘాట్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు తనిఖీ చేసిన తర్వాతే భక్తులకు ఆహార పదార్ధాలు పంపిణీ చేస్తారు. ఉత్సవాల నాటికి చేస్తున్న పనులన్నీ పూర్తవ్వాలని సోమా కంపెనీని ఆదేశించారు.


ఈ దసరా ఉత్సవాల ఏర్పాట్లను మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ మున్సిపల్ కమీషనర్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఈవో పాల్గొన్నారు. దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి దుర్గగుడిలో ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కన్నబాబు మీడియాకు వివరాలు అందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: