ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. ఇప్పటికే గ్రామ సచివాలయాల్లో లక్షకుపైగా ఉద్యోగాల భర్తీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అయితే అంతకుముందు ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలనుకుంటోంది.  ఏపీపీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి కొత్త విధానం రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. 


ఏపీలోని వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. అన్ని శాఖల అధికారులతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సమావేశమయ్యారు. శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను అందివ్వాలని ఆదేశించారు. ప్రతేడాది జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని గతంలోనే సీఎం జగన్ ప్రకటించారు. సీఎం ఆదేశాలతో శాఖల వారీగా ఖాళీల భర్తీపై ప్రభుత్వ యంత్రాంగం ఫోకస్ పెట్టింది. 


వచ్చే నెలాఖరు నాటికి భర్తీ చేయాల్సిన ఖాళీల వివరాలతో నివేదికలివ్వాలని సీఎస్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శాఖల నుంచి పూర్తిస్థాయి సమాచారం వచ్చాక ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు ఇవ్వనున్న ప్రభుత్వం. అయితే అంతకుముందుగానే ఏపీపీఎస్సీ ప్రక్షాళనపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి కొత్త విధానాన్ని రూపొందించే పనిలోపడింది. వివిధ శాఖల్లోని పోస్టులను ఆరు కేటగిరీల ద్వారా భర్తీచేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఉన్న 267 కేటగిరీలను.. ఇకపై ఆరు కేటగిరీల పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది. 


ప్రతి ఏడాది.. జనవరిలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకోసం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ పోస్టును ఏపీపీఎస్సీలో కొత్తగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం అనుకున్నట్టుగా అంతా జరిగితే ఏపీలో నిరుద్యోగుల కష్టాలు తీరినట్టే. మొత్తానికి ఏపీలో ఉండే నిరుద్యోగుల్లో ఒకింత ఆనందం వ్యక్తమవుతోంది. జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం.. ఆ దిశగా అడుగులు పడటంతో నిరుద్యోగులు బిజీ అయిపోయారు. ఎక్కడ చూసినా పుస్తకాలతో కుస్తీ పడుతూ బిజీగా గడిపేస్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: