మొన్నటి ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు పోటి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు ఎన్నికలతో పోల్చితే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటి తగ్గిపోయింది. అంటే ప్రతి ఎన్నికకు మెజారిటి తగ్గిపోతోందన్నది వేరే విషయం. అయితే తన మెజారిటి తగ్గిపోవటానికి తాజాగా చంద్రబాబు తన మనసులోని మాటను బయటపెట్టారు.
చంద్రబాబు చెప్పిన కారణాలు ఎలా ఉన్నాయంటే మైనస్ ఎదురైతే నీవల్లే ప్లస్ వస్తే మాత్రం తన ఘనతే అని చెప్పుకునేట్లే ఉన్నాయి. చంద్రబాబు నైజం కూడా ఇలానే ఉంటుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కుప్పం నియోజకవర్గంలోని నేతలతో సమావేశమయ్యారు లేండి. ఆ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని నేతల్లోని లోపాలు, నేతలపై జనాల్లో ఉన్న వ్యతిరేకత వల్లే తనకు మెజారిటి తగ్గిపోయిందంటూ మండిపడ్డారు. పైగా నేతల్లోని లోపాలను తనకు చెప్పకపోవటం కార్యకర్తల తప్పే అని కూడా తేల్చేశారు.
మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు వచ్చింది 30 వేల మెజారిటి మాత్రమే. అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి మూడు రౌండ్లలో వైసిపి అభ్యర్ధి చంద్రమౌళికన్నా వెనకబడ్డారు. ఎప్పుడూ లేంది చంద్రబాబే మూడు రౌండ్లలో వెనకబడటంతో అందరిలోను టెన్షన్ పెరిగిపోయింది. తర్వాత రౌండ్లలో ఏదో అదృష్టం కొద్దీ మెజారిటిలు పెరిగి చివరలో గెలిచారు.
సమావేశంలో నేతల మధ్య ఉన్న గొడవలు, తమను నేతలు ఎలా దూరంగా పెడుతున్నది అనే వివరాలను కార్యకర్తలు వివరించారు. అధికారంలో ఉన్నపుడు కూడా తమను నేతలు పట్టించుకోలేదని ఆరోపించినపుడు తనదృష్టికి ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు. అయితే వారు మాట్లాడుతూ ’అధికారంలో ఉన్నపుడు తమను ఎప్పుడు దగ్గరకు రానిచ్చారం’టూ నిలదీయటంతో వెంటనే మాటను మార్చేశారు. మొత్తానికి తన పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నా తన మెజారిటి తగ్గిపోవటానికి నేతలపై వ్యతిరేకతే కారణమంటూ చంద్రబాబు ఫిక్సయిపోయినట్లు అందరికీ అర్ధమైపోయింది. ఇలాంటి సమీక్షలు ఎన్ని జరిపినా టిడిపిని ఎవరూ బాగుచేయలేరన్న విషయం కూడా అర్ధమైపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి