చంద్రబాబునాయుడును రక్షించటానికి ఎల్లోమీడియా ఎంతకైనా తెగిస్తుందని అందరికీ తెలిసిందే. కానీ అదే చంద్రబాబును రక్షించటానికి ప్రత్యర్ధులపై బురద చల్లటానికి ఎంతమాత్రం వెనకాడదనేందుకు తాజా ఉదాహరణే పై ఫొటో. జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే ఏకైక ధ్యేయంగా  ఎల్లోమీడియా తనిష్టానుసారం చెలరేగిపోతోంది. గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలోని కంభంపాడు గ్రామంలో జరిగిన గొడవను జగన్ ప్రభుత్వానికి చుట్టేసేందుకు ఎల్లోమీడియా చూపించిన అత్యుత్సాహం స్పష్టంగా బయటపడింది.

 

పై గ్రామంలో పొలంగట్టు తగాదాలో బంధువుల మధ్యే గొడవలు జరిగింది. దాంతో ఒక వర్గం మీద మరో వర్గం దాడి చేసింది. ఈ దాడిలో వెంకయ్య అనే రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. అదే విషయాన్ని ఈనాడు దినపత్రిక తన లోకల్ ఎడిషన్లో స్పష్టంగా ప్రచురించింది. అంటే జరిగిన ఘటనను జరిగినట్లుగా రిపోర్టు చేశాడు స్ధానిక విలేకరి.

 

సీన్ కట్ చేస్తే అదే రైతు వెంకయ్య మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాడు. తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పాల్గొనాలని అనుకుంటున్నందుకే తనపై వైసిపి నేతలు గొడ్డలితో దాడి చేసి గాయపరిచినట్లు ఏడ్చేశాడు. సర్పంచుగా పోటి చేయాలని అనుకోవటమే తాను చేసిన నేరమా ? అంటూ చాలా అమాయకంగా ప్రశ్నించేశాడు.

 

దాన్ని ఎల్లోమీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఎప్పుడైతే ఎల్లోమీడియా ప్రచురించిందో వెంటనే చంద్రబాబు, టిడిపి నేతలు రెచ్చిపోయి అధికారపార్టీపై నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. అయితే అసలు విషయాన్ని వైసిపి సోషల్ మీడియా బయటపట్టేసింది. దాంతో సదరు ఎల్లోమీడియా పరువంతా పోయింది. అయినా ఎల్లోమీడియా పరువు ఎప్పుడో వదిలేసింది లేండి.

 

అంటే తాము రాస్తున్న కథనాలు తప్పని తెలిసే జగన్ పై బురద చల్లటానికి శాయశక్తుల ప్రయత్నిస్తోంది ఎల్లోమీడియా. మొన్నటి ఎన్నికల్లో  ఎన్ని భ్రమలు కల్పించినా, ఎన్ని మాయలు చేసినా జనాలు మోసపోకుండా చంద్రబాబుకు బుద్ధి చెప్పినా ఎల్లోమీడియాకు ఇంకా బుద్ధరాలేదు. ఎక్కడైనా తప్పు జరిగితే ప్రశ్నించటంలో తప్పే లేదు. కానీ లేనిదాన్ని జరిగినట్లుగా చూపేందుకు తాపత్రయపడటమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: