కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జేబీఎస్ ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి మెట్రో అధికారులు తనను ఆహ్వానించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా నియోజకవర్గంలో మెట్రో రైలు ప్రారంభమైతే కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వరా...? అని అధికారులపై కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి అధికారులను కేంద్రం సహకారం లేకుండా మెట్రో ప్రాజెక్ట్ నిర్మించారా..? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 
 
కేంద్రం 250 కోట్ల రూపాయల నిధులు ఇంకా ఇవ్వాల్సి ఉందని ఆ నిధుల కోసం అధికారులు ఢిల్లీకి రావొద్దని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కేంద్రం నిధులు కావాలని పీఎం ఫోటో మాత్రం ఉండదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పటికే 1250 కోట్ల రూపాయల నిధులను మెట్రోకు ఇచ్చామని కిషన్ రెడ్డి అధికారులకు గుర్తు చేశారు. టీఆర్ఎస్ ఫంక్షన్ లా మెట్రో రైలు ప్రారంభోత్సవాన్ని చేస్తారా...? అంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 
 
కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లోని దిల్ కుషా అతిథి గృహంలో మెట్రో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్‌ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి, జీఎం రాజేశ్వర్, ఎల్‌టీఎంఆర్‌హెల్‌ఎల్ ఏకే షైనీ, ప్రాజెక్టు డైరెక్టర్ ఎంపీ నాయుడు, హెచ్‌ఎంఎల్‌ఆర్ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ఆనంద్ మోహన్, ఇతరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. 
 
మెట్రో రైలు ప్రారంభోత్సవం అనేది ఎల్ అండ్ టీ వ్యక్తిగత వ్యవహారమో ఇంటి పనో కాదు అని లోకల్ ఎంపీని పిలవకుండా మెట్రో రైలు ప్రారంభోత్సవం ఎలా చేస్తారని కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ అండ్ టీ సంస్థ భవనాల కోసం, అనుమతుల కోసం అడగవద్దని ఇకనుండి భవనాలు, అనుమతులు ఇవ్వము అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఈ నెల 7వ తేదీన మెట్రో రైలులో కీలకమైన జేబీఎస్ ఎంజీబీఎస్ మార్గాన్ని ప్రారంభించారు. సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: