టీడీపీ హయాంలో ఎమ్మార్వో వనజాక్షిపై అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన దాడి.. ఏపీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు అదే వనజాక్షిని  రాజధాని ప్రాంతంలో రైతులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజధాని భూముల్ని పేదల ఇళ్లస్థలాలకు ఇవ్వడానికి ప్రజాభిప్రాయ సేకరణ కోసం  వచ్చిన వనజాక్షిని.. కొత్తూరు తాడేపల్లిలో రైతులు అడ్డుకున్నారు. తమను కులం పేరుతో దూషించి, దాడి చేశారని వనజాక్షిపై కొత్తూరు తాడేపల్లి మహిళా రైతులు కేసు పెట్టారు. తనపై దాడి చేశారని వనజాక్షి కూడా కేసు పెట్టారు. 

 

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తహశీల్దార్ వనజాక్షికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి  చేరుకున్న ఆమెపై స్థానికులు దాడికి ప్రయత్నించారు. ఆమెను చుట్టుముట్టారు. వాగ్వాదానికి దిగారు. సకాలంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ  ఘటనతో కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల సహకారంతో వనజాక్షి సంఘటనా స్థలం నుంచి బయట పడ్డారు. 

 

వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా బదలాయించి వాటిని పేద కుటుంబీకులకు పంపిణీ చేయాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో  భాగంగా.. ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి ఆదేశాలను జారీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం రెవెన్యూ అధికారులు  కొత్తూరు తాడేపల్లిలో  సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొనడానికి తహశీల్దార్ వనజాక్షి అక్కడికి చేరుకోగా.. రైతులు ఆమెను అడ్డుకున్నారు.

 

వ్యవసాయ భూములను ఇళ్ల పట్టాలుగా బదలాయించడానికి తాము అంగీకరించట్లేదని రైతులు చెప్పారు. తమ పొలాలను పేదలకు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం  వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వనజాక్షి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను చేసినట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయ కార్యక్రమానికి వచ్చిన వారు నిజమైన రైతులు  కారని, వారంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటూ వనజాక్షి వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వచ్చాయి. వారంతా బయటికి వెళ్లిపోవాలని ఆదేశించారని తెలుస్తోంది.

 

ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహించిన స్థానికులు దాడికి దిగారు. వనజాక్షిని చుట్టుముట్టారు. వాగ్వాదానికి దిగారు. తమ వ్యవసాయ భూములను స్వాధీనం  చేసుకోవడానికి నువ్వెవరివంటూ మండిపడ్డారు. దాడికి యత్నించారు. సకాలంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. స్థానికులను చెదరగొట్టారు. వనజాక్షిని  సురక్షితంగా బయటికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

వనజాక్షి తీరుపై మహిళలు, రైతులు మండిపడ్డారు. ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రౌడీ ఎమ్మార్వో అంటూ నినాదాలు చేశారు. ఆమెపై  ఎమ్మెల్యే, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మూడేళ్ల క్రితం ఇదే వనజాక్షి పేరు ఏపీలో మార్మోగింది. ఎమ్మార్వో వనజాక్షి-ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ల మధ్య గొడవ విషయం అంత తేలిగ్గా మరిచిపోయేదేమి కాదు. ప్రభుత్వ అధికారిపై ఎమ్మెల్యే అనుచరులు విరుచుకుపడిన తీరుపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎమ్మార్వోపై దాడికి పాల్పడింది అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో.. వివాదం పెద్దది కాకుండా చూడటానికి ప్రభుత్వమే చొరవచూపింది. చింతమనేనితో రాజీకి వచ్చేలా రాయబారం నెరిపింది. ప్రభుత్వ ఉద్యోగులకే రక్షణ లేకుండా పోతుందన్న విమర్శలు ఎక్కువవడంతో.. దీనిపై ఓ ద్విసభ్య కమిటీని కూడా వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: