వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ చంద్రబాబును జైలుకు పంపంపడమే ఎన్టీఆర్ కోరిక అని అన్నారు. ఎన్టీయార్ చనిపోక ముందు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. 
 
ఎన్టీఆర్ తనతో మళ్లీ తాను అధికారంలోకి వస్తే చంద్రబాబును అండమాన్ జైలుకు పంపుతానని చెప్పేవారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరుతో ఎన్టీయార్ చివరిరోజుల్లో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సిట్ ఏర్పాటు చేశారని విచారణలో వాస్తవాలు బయటపడతాయని అన్నారు. 
 
నిజాలు వెలుగులోకి వచ్చిన తరువాత చంద్రబాబుతో పాటు సుజనా చౌదరి, అచ్చెన్నాయుడు కూడా జైలుకెళతారని లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీయార్ కోరికను జగన్ తీరుస్తారని లక్ష్మీ పార్వతి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో లక్ష్మీ పార్వతి చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని, ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని కోర్టు మెట్లెక్కారు. 
 
వైసీపీ ప్రభుత్వం మూడు రోజుల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలపై సిట్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ రాష్ట్ర విభజన తరువాత టీడీపీ చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన అంశాలు, చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాల గురించి సమగ్ర విచారణ జరపనుంది. లక్ష్మీ పార్వతి సిట్ విచారణలో చంద్రబాబు అవినీతి, అక్రమాలు బయటకు వస్తే బాబు జైలుకు వెళతారని ఆశిస్తోంది. 
.                         
 

మరింత సమాచారం తెలుసుకోండి: