హైద‌రాబాద్ న‌గ‌రంలో యువ‌త‌, ఐటీ, రంగం గురించి కొత్త‌గా సంచ‌ల‌న అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. కొద్దికాలం కిందటి వ‌ర‌కు ఉన్న వ్య‌స‌నం ఉన్న బ‌దులుగా కొత్త వ్య‌స‌నం తెర‌మీద‌కు వ‌చ్చింది. న‌గ‌రంలో హుక్కా సెంటర్లు మూసేయడంతో... ఇప్పుడు కొత్తగా గంజాయి తీసుకోవ‌డం అనే వ్య‌స‌నం వైపు ఆక‌ర్షితులు అవుతున్నార‌ని చెప్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దృష్టి పెట్టినా.. కొత్త కొత్త పద్దతులతో గుట్టు చప్పుడు కాకుండా కిలోల కొద్ది గంజాయి ల‌భిస్తుండ‌టంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు గంజాయి కొంటున్నట్లు, వ్య‌స‌న‌ప‌రులు అవుతున్న‌ట్లు చెబుతున్నారు. 

 

హైదరాబాద్  అడ్డాగా వివిధ ప్రాంతాలకు గంజాయి స‌ర‌ఫ‌రా అవుతున్నట్లు చెబుతున్నారు. స్మ‌గ్ల‌ర్ల‌ దగ్గర నుంచి మొదలయ్యే ఈ దందా పాన్ డబ్బా వ్యాపారులకు, అక్కడ నుంచి మిగతా వారికి సప్లై అవుతున్నట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. చాప కింద నీరులా...పెద్ద ఎత్తున గంజాయి వాడుతున్నార‌ని తేలింది. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే గంజాయి స్మగ్లర్ల మెయిన్ కస్టమర్లుగా మారుతున్నారని, సిటీలోని చాలా ప్రైవేట్ హాస్టల్స్ గంజాయితో నిండిపోతున్నాయని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో సిటీ పోలీసులతో పాటు కేంద్ర ప్రభుత్వ ద‌ర్యాప్తు సంస్థ‌లు కూడా గంజాయి అక్రమ రవాణాని అడ్డుకుంటున్నాయి. నగరంలో పట్టుబడుతున్న మాదకద్రవ్యాల్లో గంజాయే మొదటి స్థానంలో ఉండ‌టం నగరంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

గంజాయి సేవ‌నాన్ని వ్యసనంగా మార్చుకుని.. చివరకు యువత ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారని పోలీసులు చెప్తున్నారు. గంజాయికి అలవాటు పడితే.. మానడం చాలా కష్టమని.. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని సైక్రియాటిస్టులు విశ్లేషిస్తున్నారు. పిల్లలను త‌ల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని సూచిస్తున్నారు. కాగా, గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మ‌రింత దృష్టి పెట్టాల‌ని ప‌లువురు కోరుతున్నారు. స్మ‌గ్ల‌ర్లు కొత్త కొత్త పద్దతులతో గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ దందాపై ఉక్కు పాదం మోపాల‌ని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: