మధ్య ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కమల్‌నాథ్ సర్కారు ఫ్యూచర్ సోమవారం తేలిపోనుంది. బలపరీక్షకోసం గవర్నర్ ఆదేశించారు. కాంగ్రెస్, బిజెపిలు విప్ జారీ చేశాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. 

 

మధ్య ప్రదేశ్ సర్కారు భవితవ్యం సోమవారం తేలనుంది. సోమవారం ఉదయం 11గంటల తర్వాత మధ్యప్రదేశ్ అసెంబ్లీలో విశ్వాసపరీక్ష జరగనుంది. 2018లో అరకొర ఆధికత్యతతో  అధికారం లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 230 మంది సభ్యులున్న అసెంబ్లీలో 121మంది సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఇందులో 114మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ సబ్యులున్నారు. అసెంబ్లీలో బీజేపీకి 107మంది సభ్యుల బలం ఉంది. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. 

 

అయితే గత మంగళవారం జ్యోతిరాదిత్య సింధియా రాజీనామాతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ లో రాజకీయం మారిపోయింది. సింధియా వెంట పలువురు ఎమ్మెల్యేలు కలిసి నడిచారు.  ఈ  పరిణామాలతో కమల్నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఆరుగురు మంత్రులతో సహా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మార్చి 10 న శాసనసభకు రాజీనామా చేశారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్కు రాజీనామా చేసిన వెంటనే శాసనసభ్యులు తమ రాజీనామా లేఖలను స్పీకర్‌కు పంపారు. ఆ తరువాత సింధియా బీజేపీలో చేరారు. 

 

అయితే రెండు రోజుల క్రితం గవర్నర్ టాండన్‌ ను కలిసి కమల్ నాథ్ బలపరీక్షకు తాను సిద్ధమని ప్రకటించారు. మరోపక్క రెండు పార్టీలు ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు ఉధృతంగా నడిపాయి. కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను జైపూర్ కు, బీజేపీ తన ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను గురుగ్రామ్, మానేసర్, బెంగుళూరు కు తరలించింది. బలపరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు జైపూర్ నుంచి బోపాల్ తిరిగి వచ్చారు.  

 

అయితే రాజీనామా చేసిన 22మంది ఎమ్మెల్యేలలో ఆరుగురి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. దీంతో సభలో మొత్తం సభ్యుల సంఖ్య 222కు చేరింది. 112 మ్యాజిక్ ఫిగర్ ని సాధిస్తే, కమల్ నాథ్ సర్కారు నిలబడే అవకాశం ఉంది. మిగిలిన 16మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఇంకా ఆమోదించ లేదు. ఈ రాజీనామాలను కూడా ఆమోదిస్తే కాంగ్రెస్ బలం 92కి పడిపోతుంది. అదే సమయంలో ఇప్పటి వరకు కాంగ్రస్ తో ఉన్న నలుగురు ఇండిపెండెంట్లు, ఒక ఎస్పీ, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేల్లో రేపు బలపరీక్షలో కాంగ్రెస్ ఉండేదెవరు? బీజెపీ వైపు మళ్లేదెవరనే సందేహాలు కూడా ఉన్నాయి. సో, ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు జరగబోయే బలపరీక్ష కమల్‌ నాథ్‌ కు కత్తి మీద సాములా మారింది.

 

మధ్యప్రదేశ్ లో 2018 లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటినుంచి అంతర్గత విబేధాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు సింథియా. ఈ పరిణామాలను ముందుగా అంచనా వేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలో అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని శనివారం మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ బృందం గవర్నర్ టాండన్ను కలిసింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే... బలపరీక్ష నిర్వహించాలని కోరారు. ఈ మేరకు గవర్నర్కు వినతి పత్రం కూడా సమర్పించారు. బిజెపి ప్రతినిధి బృందం గవర్నర్ను కలుసుకుని అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నిర్వహించాలని కోరిన తరువాత గవర్నర్ బలపరీక్ష నిర్ణయం వెలువరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: