నెలరోజుల నుంచి ఒక్కకేసు కూడా లేకుండా ఫ్రీజోన్ గా ఉన్న ఆ జిల్లాలో ఒక్కరోజులోనే మూడు పాజిటివ్ లు నమోదు కావడం కలవరపాటుకు గురిచేస్తోంది. అయితే  పాజిటివ్ కేసులకు కారణమైన అసలు వ్యక్తికి మాత్రం  రిపోర్టులు నెగిటివ్ గా రావడంతో  అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ నుంచి పాజిటివ్ రావడాన్నే చూసిన తరుణంలో మెయిన్ కాంటాక్ట్ కు నెగిటివ్ వచ్చి ...అతని ద్వారా మిగిలిన వారికి వైరస్ సోకడం  పై సర్వత్రా చర్చ నడుస్తోంది.


ఏపీలో కరోనా విజృంభిస్తున్న వేళ నిన్నమొన్నటి వరకూ చాలా ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో తొలి పాజిటివ్ కేసులు నమోద కావడంతో ఒక్కసారిగా జిల్లా ఉలిక్కిపడింది . పాతపట్నం మండలం సీది గ్రామానికి  చెందిన యువకుడి ద్వారా అతని కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే ఇప్పుడు ఒకే ఒక్క విషయం అటు జిల్లా వాసులు, అటు అధికారులకు అర్ధం కావట్లేదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే  ఈ మహమ్మారి ... అసలు వ్యక్తిని వదిలేసి ... మిగిలిన వారికి ఎలా సోకిందో అని తెగ చర్చించుకుంటున్నారు.   

 

పాతపట్నం మండలంలోని సీది గ్రామానికి చెందిన వ్యక్తి  ఢిల్లీలోని మెట్రో రైల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నాడు. అయితే ఉగాది పండుగ సందర్భంగా మార్చి 17న ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి మార్చి 19వ  తేదీన శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నాడు. ట్రైన్ దిగిన అనంతరం నేరుగా అత్తగారింటికి కాగువాడ వెళ్లాడు. ఇదిలా ఉంటే ఢిల్లీ మర్కజ్ మతపరమైన సమావేశాలకు వెళ్లొచ్చిన వారికి కరోనా పాజిటివ్ లక్షణాలు  బయటపడుతున్న తరుణంలో జిల్లాలో ఎవరైనా ఢిల్లీకి వెళ్లారా...వచ్చారా..అనే కోణంలో అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన 211 మందిని గుర్తించగా వారిలో పాతపట్నం సీది గ్రామానికి చెందిన వ్యక్తి  ఉన్నాడు. వీరందరినీ హోమ్ క్వారంటైన్ లో ఉంచి...ఎప్పటికప్పుడు మెడికల్ సిబ్బంది , ఏఎన్ఎంలు..గ్రామవాలంటీర్లు వీరి కదలికలపై ఆరాతీసేందుకు అధికారులు అన్ని చర్యలూ తీసుకున్నారు. 28 రోజులు హోమ్  ఐసోలేషన్ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించే క్రమంలో సీదిగ్రామానికి చెందిన వ్యక్తికి ట్రూనాట్ కిట్ తో మెడికల్ సిబ్బంది టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ లో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు తేలడంతో అధికారులు  అప్రమత్తమైపోయారు. ఆ వ్యక్తితో పాటు అతని కుటుంబ సభ్యులను జిల్లా కోవిడ్ -19 హాస్పిటల్ జెమ్స్ కు తరలించారు. జెమ్స్ లో ఆయువకుడికి ర్యాపిడ్ కిట్ లో టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది. రెండు టెస్టుల్లో  రిపోర్టులు వేర్వేరుగా రావడంతో కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలకు పరీక్షల నిమిత్తం పంపించారు. ఇదే క్రమంలో అతని కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు జరపడంతో వారికి పాజిటివ్ అని తేలింది. అయితే కాకినాడ నుంచి వచ్చిన రిపోర్టులో అసలు అనుమానిత లక్షణాలు బయటపడిన వ్యక్తికి నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది...కానీ అతని కుటుంబంలోని ముగ్గురికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. 

 

శ్రీకాకుళం జిల్లాలో కరోనా ఎంటరవ్వడం...అదికూడా ఒకేసారి మూడుకేసులతో ఎంట్రీ కావడంతో జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ ఈ మూడు పాజిటివ్ కేసుల రిపోర్టులు ఒకలా..వీరందరికీ వైరస్  వ్యాపించడానికి కారణమైన అసలు వ్యక్తికి నెగిటివ్ గా రావడం పైనే ఇప్పుడు అంతా చర్చనడుస్తోంది. వాస్తవానికి వైరస్ వ్యాప్తికి కారణమైన అసలు వ్యక్తి గత కొద్దికాలంగా వేరే అనారోగ్య కారణం తో బాధపడుతున్నట్లు  తెలుస్తోంది. ఈక్రమంలో గడచిన ఐదారునెలలుగా ఇమ్యునిటీ పవర్ పెరగడం కోసం ... ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటూ...అందుకు కావాల్సిన మెడిసిన్ వాడుతున్నట్లు సమాచారం . ఈక్రమంలో ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్  ప్రెస్ లో వచ్చినప్పటికీ ... 28 రోజులు క్వారంటైన్ లో ఉన్నప్పటికీ ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు బయటపడలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: