ఆయా దేశాల సైనిక బలగాన్ని బట్టి.. ఆ దేశం శక్తి సామర్థ్యాలేంటో చెప్పొచ్చు. దేశాన్ని ముందుండి నడిపించే సైనికులకు అత్యాధునిక ఆయుధాలు ఎంతో అవసరం. యుద్ధ సామాగ్రి కోసం చేసే ఖర్చు కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఆయుధాల కోసం భారీగా ఖర్చు పెట్టే దేశాల్లో.. ముందు వరుసలో ఉన్నవి ఇవే..!


 
ప్రపంచ దేశాల యద్ధ సామాగ్రి కోసం ప్రతి ఏడాదికి గాను చేసే ఖర్చును స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తెలియజేస్తుంటుంది. అందులోభాగంగా గతేడాది 2019 సంవత్సరానికి గాను మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 1917 బిలియన్లకు పెరిగింది. 2018తో పోల్చుకుంటే 2019 సంవత్సరానికి 3.6 శాతం పెరిగింది. 2019 లో ఐదు అతి పెద్ద దేశాలైనటువంటి యునైటెడ్ స్టేట్స్, చైనా, ఇండియా, రష్యా మరియు సౌదీ అరేబియా 62 శాతం ఖర్చు చేశాయి. 2019 లో గ్లోబల్ మిలిటరీ వ్యయం ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 2.2 శాతంగా ఉంది. గ్లోబల్ మిలిటరీ వ్యయం 2010 లో కంటే 2019 లో 7.2 శాతం అధికంగా ఉంది. 

 

సైన్యం కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసిన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా ఆసియా దేశాలు చైనా, భారత్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయని వెల్లడించింది. ఇక అగ్రరాజ్యం అమెరికా 732 బిలియన్‌ డాలర్లు సైనిక వ్యవస్థ కోసం ఖర్చు చేసిందని ఎస్‌ఐపీఆర్‌ఐ తెలిపింది. ఈ జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో అమెరికా, చైనా, భారత్‌, రష్యా, 'సౌదీ అరేబియా నిలిచాయని.. ప్రపంచ దేశాలు సైన్యం మీద ఖర్చు చేసిన మొత్తంలో సింహ భాగం ఈ దేశాలదేనని పేర్కొంది. ఈ ఐదు దేశాలు కలిపి మొత్తంగా 62 శాతం నిధులు రక్షణ వ్యవస్థ కోసం వెచ్చించాయని తెలిపింది. 2018తో పోలిస్తే చైనా 2019లో మిలిటరీ మీద ఖర్చు చేసిన వ్యయం 5.1 శాతం పెరగగా.. చైనా, పాకిస్తాన్‌ దేశాల సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్‌ 6.8 శాతం ఎక్కువగా ఖర్చు చేసిందని నివేదికలో తెలిపింది. గతేడాది చైనా మొత్తంగా సైన్యం మీద 261 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయగా.. భారత్‌ 71.1 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. 

 

ఇక జపాన్‌ 47.6 బిలియన్ డాలర్లు‌, దక్షిణ కొరియా 43.9బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసి రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకున్నాయని వెల్లడించింది. అయితే 2020లో కరోనా సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఈ ఏడాది సైన్యం మీద ఖర్చు చేసే మొత్తం తక్కువగానే ఉండవచ్చని ఎస్‌ఐపీఆర్‌ఐ అంచనా వేసింది. ఇక ఎస్‌ఐపీఆర్‌ఐ ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయాల అభివృద్ధిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందంటుంది. సైనిక వ్యయం అంటే ప్రస్తుత సైనిక దళాలు మరియు కార్యకలాపాలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ వ్యయాలను సూచిస్తుంది. వీటిలో జీతాలు, ప్రయోజనాలు, కార్యాచరణ ఖర్చులు, ఆయుధాలు, పరికరాల కొనుగోళ్లు, సైనిక నిర్మాణం, పరిశోధన మరియు అభివృద్ధి ఉన్నాయి. అందువల్ల ఆయుధాలపై ఖర్చు చేయడాన్ని ఆ దేశాల్లో మైనారిటీగానే తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: