దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. మార్చి 24 నుంచి కరోనా వైరస్ ని కంట్రోల్ చేసే పనిలో భాగంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.  దాదాపు రెండు నెలల లాక్ డౌన్ తర్వాత ఈ మద్య సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో మూత పడ్డ కంపెనీలు ఓపెన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖపట్నంలోని ఎల్టీ పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువు లీకయిన ఘటనతో దేశం యావత్తు ఉలిక్కిపడింది. దాదాపు 31ఏళ్ల కిందట జరిగిన భోపాల్ దుర్ఘటనను ఒక్కసారిగా గుర్తుచేసింది. ఈ ఘటన మరువక ముందు పలు కంపెనీల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

 

తాజాగా గుజరాత్‌లోని పారిశ్రామిక ప్రాంతం దహేజ్‌లోని ఇవాళ(బుధవారం) ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంది గాయపడ్డారు.  సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 10 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. గాయపడిన వారిని భారుచ్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారని తెలిపారు.  

 

మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు భారుచ్ జిల్లా కలెక్టర్ తెలిపారు.మధ్యాహ్నం ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో దాదాపు 40 మంది కార్మికులకు మంటలు అంటుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీ నుంచి విషవాయువు వెలువడుతుండడంతో సమీపంలోని గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో వైపు కంపెనీలు తెరవాలంటే ప్రభుత్వ సూచనలు పాటించాలని.. అధికారుల అనుమతి తీసుకోవాలని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: