ఏపీలో ఇసుక వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇసుక లభించడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలే పలుచోట్ల కంప్లయింట్లు ఇస్తుండటంతో ఇసుక వివాదం మరింతగా ముదురుతోంది. ఇదే అదనుగా విపక్షం టీడీపీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఆరోపణాస్త్రాలు గుప్పిస్తోంది. మొన్నటికి మొన్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు... బంగారం అమ్మినట్టు ఇసుకను సున్నితపు త్రాసులో అమ్ముతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

 

 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇసుక విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఇసుక సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోనే ఆన్ లైన్ విధానంలో ఇసుకను వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్‌కు గుర్తింపు వుందన్నారు. రాష్ట్రంలో వాగులు, వంకలతో పాటు చిన్న నీటిపాయల నుంచి ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా స్థానికులు వాడుకునేందుకు వీలుగా సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారని గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు.

 

 

గతంలో వాగులు, వంకలకు చెందిన 1 నుంచి 3వ ఆర్డర్ స్ట్రీమ్ ల నుంచి మాత్రమే ఎడ్లబండ్ల ద్వారా ఉచిత ఇసుక తీసుకునే వీలుండేదన్నారు. తాజాగా ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నదులు, జలవనరులకు సమీపంలోని గ్రామాల్లోని ప్రజలు తమ అవసరాల కోసం ఎడ్లబండ్ల ద్వారా తీసుకునే ఉచిత ఇసుక పరిధిని 4, 5 ఆ పై ఆర్డర్ స్ట్రీమ్ ల వరకు కూడా పెంచాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుందని చెప్పారు.

 

హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం వున్న వారికే ముందుగా ఇసుక లభిస్తుండటంతో, పోర్టల్ ప్రారంభించిన కొద్దిసేపటికే బుక్ అవుతోందని ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉందన్నారు.. దీనివల్ల అవసరం లేని వారు కూడా ఇసుకను బుక్ చేసుకుని బ్లాక్ లో అమ్ముకుంటున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: